పైసలతో పాటు ప్రశాంతత పోయే..
ఢిల్లీ: ఆన్లైన్ మోసాల బారిన పడే భారతీయుల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. దీని ద్వారా నగదును కోల్పోవడమే కాకుండా మానసికంగా కూడా తీవ్ర ఒత్తిడిలను ఎదుర్కొంటున్నారు. ప్రముఖ సాఫ్ట్వేర్ సెక్యురిటీ సంస్థ నార్టన్ ఇండియా ఇటీవల వెల్లడించిన సర్వే ప్రకారం ఇండియాలోని సుమారు 11 కోట్ల మంది సైబర్ క్రైం బారినపడ్డారు. వారు ఒక్కొక్కరు సరాసరి రూ. 16,500 కోల్పోయారని వెల్లడించింది.
ఇండియాలో ఈ తరహా మోసాలకు గురైన వారిలో 36 శాతం తీవ్ర నిరాశతో కుంగుబాటుకు లోనవుతుండగా, ప్రపంచవ్యాప్తంగా ఇలా మానసిక ఒత్తిడికి లోనవుతున్న వారు 19 శాతంగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. సైబర్ క్రైం ద్వారా మోసపోయిన వారు తీవ్రమైన ఆగ్రహావేశాలకు లోనవుతున్నారని తద్వారా మానసిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నార్టన్ ఇండియా మేనేజర్ రితీష్ చోప్రా వెల్లడించారు.
ఇంటర్ నెట్ వినియోగదారుల్లో కేవంలం 40 శాతం మందికి మాత్రమే ఆన్లైన్ మోసాలలో బాధితులుగా ఉన్నప్పుడు ఎలా స్పందించాలో అన్న విషయం తెలుసు అని సర్వే పేర్కొంది. ఆన్లైన్ మోసాలలో ఎక్కువగా తమ క్రెడిట్ కార్డుకు సంబంధించిన సమాచారం తస్కరించబడటం ద్వారా బాధితులుగా మారుతున్నట్లు తెలిపింది. పాస్వర్డ్ల వివరాలతో పాటు మిగతా విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించి ఆన్లైన్ మోసాల బారిన పడకుండా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.