అత్యాచారం చేసి.. యాసిడ్ తాగించి..
ఢిల్లీ: ఢిల్లీలో మరో నిర్భయ తరహా ఘటన జరిగింది. ఓ 14 ఏళ్ల దళిత బాలికపై ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడి, యాసిడ్ లాంటి పదార్థం తాగించాడు. దీంతో అంతర్గత అవయవాలు పాడైపోయిన ఆ బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్(డీసీడబ్ల్యూ) తీవ్రంగా స్పందించింది. బాలిక మృతికి వ్యవస్థే కారణమంటూ తీవ్రంగా మండిపడింది.
ఢిల్లీకి ఇంకా ఎంతమంది నిర్భయలు కావలి అంటూ డీసీడబ్ల్యూ చైర్ పర్సన్ స్వాతీ మలివల్ తీవ్రంగా మండిపడ్డారు. 'మనం మరో నిర్భయ మృతి చెందేవరకు వెయిట్ చేశాం' అంటూ ట్విట్టర్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో మహిళా కమిషన్ డీసీపీకి నోటీసు ఇచ్చిన తరువాతే నిందితుడిని అరెస్ట్ చేశారన్న విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. మహిళల రక్షణ విషయంలో హోంమంత్రి అధ్యక్షతన ఓ కమిటీని నియమించాలని స్వాతీ సూచించారు. ఢిల్లీలో మహిళా రక్షణకు ఏర్పాటు చేసిన స్పేషల్ టాస్క్పోర్స్ను ఇటీవల కేంద్రం రద్దు చేయడాన్ని ఆమె తప్పుపట్టారు.