శ్రీనగర్ లో సోమవారం ఉదయం హిజ్బుల్ ముజాహిద్దీన్ తీవ్రవాదులు పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు.
శ్రీనగర్ లో సోమవారం ఉదయం హిజ్బుల్ ముజాహిద్దీన్ తీవ్రవాదులు పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. రెండు వేర్వేరు ప్రదేశాల్లో దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు ముగ్గురు పోలీసులను పొట్టనబెట్టుకున్నారు. చెక్ పోస్టుకు చేరువలో ఉన్న షాపులో టీ తాగడానికి వెళ్లిన పోలీసులను బైక్ పై వచ్చిన టెర్రరిస్టులు కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ దాడిలో అసిస్టెంట్ సబ్-ఇన్ స్పెక్టర్ గులాం మహ్మద్, హెడ్ కానిస్టేబుల్ నజీర్ అహ్మద్ లు అక్కడికక్కడే మరణించారు.
నగరంలోని మరో ప్రాంతంలో జరిగిన మరో దాడిలో మహ్మద్ సాధిఖ్ అనే పోలీసు అధికారిని అతిక్రూరంగా చంపి అతని ఆయుధాన్ని తీసుకుని వెళ్లారు. దీంతో ఒక్కసారిగా శ్రీనగర్ లో అలజడి చెలరేగింది. కాల్పుల ప్రాంతానికి భారీగా చేరుకున్న భద్రతా దళగాలు ముష్కరుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. గత నాలుగు నెలల్లో 40మందికి పైగా టెర్రరిస్టులు పాకిస్తాన్ నుంచి జమ్మూకశ్మీర్ లోకి ప్రవేశించినట్లు అధికారి ఒకరు చెప్పారు.
సోమవారం హిజ్బుల్ ముజాహిద్దీన్ కు చెందిన టెర్రరిస్టులు దాడులకు తెగబడే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్ నుంచి ముందే సమాచారం ఉన్నట్లు వివరించారు. దాడి జరిగిన సమయంలో పోలీసులు వద్ద ఆయుధాలు లేవని వెల్లడించారు. మధ్యహ్నం జరగిన పోలీసుల అంత్యక్రియల్లో జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ పాల్గొన్నారు.