
2 వారాల్లో ‘గంగ’ ప్రక్షాళన!
రోడ్‌మ్యాప్ సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించిన సుప్రీం
నదిని కాపాడతామని ఎన్నికల ప్రణాళికలో చెప్పారుగా?
అప్పుడు అత్యవసరమన్నారు.. ఇప్పుడు ప్రాధాన్యం లేదా?
న్యూఢిల్లీ: గంగానది ప్రక్షాళనకు తీసుకుంటున్న చర్యలపై రెండు వారాల్లోగా మార్గదర్శకాలతో కూడిన రోడ్‌మ్యాప్‌ను సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ టి.ఎస్.ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. గంగానదిని ప్రక్షాళన చేయటం అత్యంత ప్రాధాన్యమైన అంశమని, దీనిపై తక్షణం స్పందించాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. గంగను ప్రక్షాళన చేస్తామని ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన విషయాన్ని బీజేపీ సర్కారుకు గుర్తు చేసింది. ‘మీరు గంగానదిని కాపాడుతున్నారా? ఈ అంశం మీ(బీజేపీ) మేనిఫెస్టోలో కూడా ఉంది.
దీనిపై ఎందుకు స్పందించరు?’ అని సొలిసిటర్ జనరల్ రంజీత్‌కుమార్‌ను కోర్టు ప్రశ్నించింది. ఈ అంశాన్ని జలవనరుల శాఖకు అప్పగించామని కొంత సమయం ఇవ్వాలని ఆయన కోరటంపై కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ‘ఇది అత్యవసరమైన అంశమని మీరే అన్నారు... ఇప్పుడు మీకు అంత ప్రాధాన్యం లేనట్లుగా కనపడుతోంది. రెండు మంత్రిత్వ శాఖల మధ్య విషయాన్ని తిప్పుతున్నారు’ అని ఘాటుగా వ్యాఖ్యానించింది. 2,500 కి.మీ. పొడవైన గంగానదిని కాలుష్య రహితంగా తీర్చిదిద్దుతామని ఎన్నికల ప్రణాళికలో బీజేపీ ప్రకటించిన విషయం తెలిసిందే.