ఒక్కరోజులో 20 కోట్లు | 20 crore within one day | Sakshi
Sakshi News home page

ఒక్కరోజులో 20 కోట్లు

Published Thu, Dec 15 2016 1:34 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

ఒక్కరోజులో 20 కోట్లు - Sakshi

ఒక్కరోజులో 20 కోట్లు

దేశవ్యాప్తంగా పలుచోట్ల ఐటీ, ఈడీ దాడులు
- పుణెలో బ్యాంకు లాకర్లలో రూ.10 కోట్లు
- బెంగళూరులో 2.89 కోట్లు
- ఢిల్లీలో వెలుగుచూసిన 3.25 కోట్లు


న్యూఢిల్లీ/చండీగఢ్‌/బెంగళూరు: దేశవ్యాప్తంగా ఆదాయపు పన్ను శాఖ  దాడుల్లో కోట్ల కొద్దీ నల్లధనం వెలుగుచూస్తోంది. బుధవారం వివిధ రాష్ట్రాల్లో జరిగిన దాడుల్లో రూ. 20 కోట్ల నల్లధనాన్ని స్వాధీనం చేసుకున్నారు.  

బ్యాంకు లాకర్లలో రూ.10 కోట్లు..
 పన్ను ఎగవేత దర్యాప్తులో భాగంగా ఐటీ అధికారులు పుణెలోని బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలోని పలు లాకర్లను సోదాలు చేశారు. అందులో ఉన్న రూ.10 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. పార్వతీ ప్రాంతంలోని బ్యాంక్‌ శాఖలో ఒక ప్రైవేటు కంపెనీకి చెందిన పలు లాకర్లు ఉన్నాయి. అధికారులు ఇప్పటివరకు ఐదు లాకర్లను తెరిచారు. ఈ వ్యవహారంలో బ్యాంకు అధికారుల పాత్ర ఉందనే కోణంలోనూ దర్యాప్తుచేస్తున్నారు. సీజ్‌ చేసిన నగదులో భారీగా కొత్త రూ. 2 వేల నోట్లు కూడా ఉన్నాయి.

స్కానింగ్‌లోనూ తెలియకుండా...
ఢిల్లీలో ఐటీ అధికారులు ఒక హోటల్‌పై దాడి చేసి రూ. 3.25 కోట్ల నగదు పట్టుకున్నారు. కరోల్‌బాగ్‌లోని త„ŠS ఇన్‌ హోటల్లో మూడు గదులపై డాడి చేసి, ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. డబ్బును ప్యాక్‌చేసిన విధానాన్ని చూసి అధికారులు అవాక్కయ్యారు. నిందితులు విమానాశ్రయాల్లో స్కానింగ్‌ యంత్రాలు గుర్తించకుండా ప్రత్యేక టేపులు, వైర్లను ప్యాకేజీ కోసం వినియోగించినట్లు అధికారులు తెలిపారు. వీరు ఢిల్లీలోని హవాలా వ్యాపారుల వద్ద నల్లధనం సేకరించి దాన్ని తెల్లధనంగా మార్చుతున్నట్లు గుర్తించారు.  

చండీగఢ్‌లో రూ.2.20 కోట్లు... చండీగఢ్‌లోని వస్త్రవ్యాపారి ఇందర్‌పాల్‌ మహాజన్‌ ఇంటిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు చేసిన దాడుల్లో రూ. 2.20 కోట్ల డబ్బు బట్టబయలైంది. హవాలా లావాదేవీలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో మహాజన్‌ ఇల్లు, షాపులపై దాడులు చేశారు. ఇంట్లోని బెడ్‌ బాక్సులో, ట్రంకులో, బ్యాగులో రూ.2,19,85,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో ఒక వ్యాపారి ఇంటిపై చేసిన దాడుల్లో రూ.13.93 లక్షల అక్రమ ధనం వెలుగుచూసింది. రాజస్తాన్‌లోని జైపూర్‌లో రూ.5.68 లక్షలను సీజ్‌ చేశారు. పుణేలో ఓ కారు నుంచి  రూ.67 లక్షలను, గురుగ్రామ్‌లో ఒక కారు నుంచి రూ.9.5 లక్షలను పోలీసులు సీజ్‌ చేశారు. ఢిల్లీలో రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌ ఇంట్లో ఐటీ అధికారులు రూ.64.84 లక్షల నల్లధనాన్ని పట్టుకున్నారు.

రూ. 70 కోట్లు, 170 కేజీల బంగారం సీజ్‌
ముంబై: పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో చేపట్టిన తనిఖీల్లో రూ.70 కోట్ల నగదు, 170 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్‌ఎఫ్‌) చీఫ్‌ జనరల్‌ ఓపీ సింగ్‌ తెలిపారు.

అధికారులపైకి శునకాలు..
సాక్షి, బెంగళూరు: బెంగళూరులో ఇక ఇంటిపై దాడులకు వెళ్లిన ఐటీ అధికారులకు వింత అనుభవం ఎదురైంది. ఆ ఇంట్లో ఉన్న వృద్ధ మహిళ అధికారులను లోనికి రానీయకుండా వారిపై కాపలాగా ఉన్న రెండు జాతి కుక్కలను వదిలింది. దీంతో నివ్వెరపోయిన అధికారులు పోలీసుల సాయం తీసుకోవాల్సి వచ్చింది. ‘యశ్వంత్‌పూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నల్లధనం ఉందన్న  సమాచారంతో మంగళవారం దాడులకు వెళ్లాం. అందులో ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళ మాకు సహకరించలేదు. మమ్మల్ని కుక్కలు భయపెట్టాయి. దీంతో నిన్న సోదాలు చేయలేకపోయాం’ అని అధికారులు చెప్పారు. తర్వాత ఎట్టకేలకు స్థానికులు, పోలీసుల సాయంతో బుధవారం ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లో ఓ గదికి వేసిన తాళం తీసి సోదాలు చేయగా రూ.2.89 కోట్ల అక్రమ ధనం దొరికింది. ఇందులో రూ. 2.25 కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లు ఉన్నాయి. అధికారులు డబ్బును స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తెల్లవారుజామున ఒక వ్యక్తి ఆ ఫ్లాట్‌కు వచ్చినట్లు గుర్తించారు. కాగా, గోవాలో నిర్వహించిన సోదాల్లో రూ.67.98 లక్షల విలువైన కొత్త రూ. 2 వేల నోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద నోట్లు రద్దయిన నాటి నుంచి ఇప్పటివరకు కర్ణాటక, గోవాల్లో ఐటీ అధికారులు రూ.29.86 కోట్ల నగదు పట్టుకున్నారు.

రూ.500 నోటు చెల్లుబాటు నేటి అర్ధరాత్రి వరకే
న్యూఢిల్లీ: పాత రూ.500 నోటు నేటి అర్ధరాత్రి వరకే చెల్లుబాటవుతుంది. అదీ ప్రభుత్వ సర్వీసుల చెల్లింపుల్లో, మెడికల్‌ షాపుల్లోనే.  రూ.500 నోట్లతో మొబైల్‌ రీచార్జి సదుపాయానికి అవకాశం ఉండదు. ఈ నోట్ల వినియోగానికి ఇచ్చిన డిసెంబర్‌ 15 గడువును ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించరాదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇక ప్రజలు తమ వద్ద ఉన్న పాత రూ.500 నోట్లను బ్యాంకుల్లో మాత్రమే డిపాజిట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ‘పాత రూ.500 నోట్ల వినియోగానికి ఇచ్చిన మినహాయింపులు డిసెంబర్‌ 15వ తేదీ అర్ధరాత్రితో ముగుస్తాయి’ అని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంతదాస్‌ బుధవారం ట్వీట్‌ చేశారు.

ఆ మేరకు పాత రూ.500 నోట్లను మెడికల్‌ షాపుల్లోగానీ, విద్యుత్, నీటి బిల్లులు తదితర ప్రభుత్వ సర్వీసుల చెల్లింపుల్లోగానీ ఇకమీదట ఆమోదించరు. కేంద్ర ం ఇప్పటికే రైలు లేదా విమాన టికెట్ల బుకింగ్, పెట్రోలు బంకులు, టోల్‌ప్లాజాల్లో రూ.500 నోట్ల చెల్లింపుపై పలు మినహాయింపులను ఉపసంహరించడం తెలిసిందే. నిజానికి నవంబర్‌ 8న పెద్ద నోట్లను రద్దు చేసిన సందర్భంగా ప్రభుత్వం వివిధ సర్వీసులకోసం రూ.500, రూ.1000 నోట్లు చెల్లించేందుకు 72 గంటల వ్యవధి వరకు అనుమతించింది. అయితే ఈ డెడ్‌లైన్‌ ఎప్పటికప్పుడు పెరుగుతూ డిసెంబర్‌ 15 వరకు కొనసాగింది. ప్రస్తుతం ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement