ప్రేమించడంలేదనే ఒకేఒక్క కారణంతో యువతిని హతమార్చాడు.
న్యూఢిల్లీ: ప్రేమించడంలేదనే ఒకేఒక్క కారణంతో యువతిని హతమార్చాడు. ఈ ఘటన తూర్పు ఢిల్లీలోని వెల్‌కమ్ కాలనీలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తల్లి సుహానాతో కలిసి ఓ గదిలో నిద్రిస్తున్న ఫర్హా(20)పై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. తల్లి చూస్తుండగానే కత్తితో పొడిచాడు. దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన తల్లి సుహానాను కూడా తీవ్రంగా గాయపర్చాడు. కాగా ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తి ప్రస్తుతం బెయిల్‌పై బయటకొచ్చాడని పోలీసులు తెలిపారు.
ప్రేమించమంటూ తన వెంట పడుతుం డడంతో ఫర్హా అతనిపై కేసు పెట్టిందని, దీంతో జైలుపాలై, బెయిల్‌పై వచ్చి, మళ్లీ ఫర్హా వెంట పడడంతో గురువారం ఆమె తల్లితో కలిసి మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఫర్హాపై కక్ష పెంచుకొని ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. ఈ దాడిలో ఫర్హా అక్కడికక్కడే మరణించగా ఆమెను కాపాడే ప్రయత్నంలో తీవ్ర గాయాలపాలైన తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని, దారుణానికి పాల్పడిన వ్యక్తి కోసం వేట ప్రారంభించామని పోలీసులు తెలిపారు.