న్యూఢిల్లీ: బడ్జెట్‌ను పరిశీలిస్తే- ప్రభుత్వ ఖజానాలోని ప్రతి రూపాయిలో 24 పైసలు రుణమే కావడం విశేషం. 20 పైసలను వడ్డీ చెల్లింపులకు ప్రభుత్వం వెచ్చిస్తోంది. అధిక వృద్ధి రేటును ఒకపక్క ప్రకటించుకుంటున్నప్పటికీ, మరోవైపు రెవెన్యూ వసూళ్లకు సంబంధించి కఠిన పరిస్థితులను ఇది ప్రతిబింబిస్తోంది. వివరాల్లోకి వెళితే...రానున్న ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ నుంచి ప్రభుత్వ స్థూల రుణ ప్రణాళిక రూ. 6 లక్షల కోట్లు. గత రుణాల రీపేమెంట్లు, వడ్డీలు పోను నికర రుణ ప్రణాళిక రూ.4.56 లక్షల కోట్లు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నికర పరిమాణానికి (రూ.4.53 లక్షల కోట్లు) దాదాపు ఇది సమానం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కూడా స్థూల రుణ ప్రణాళిక రూ. 6 లక్షల కోట్లు అయినప్పటికీ, వాస్తవంగా రూ.5.92 లక్షల కోట్లనే సమీకరిస్తున్నట్లు జైట్లీ బడ్జెట్ పేర్కొంది. ద్రవ్యలోటును పూడ్చుకోడానికి సంబంధించి టీ-బిల్స్, ఇతర ఇన్‌స్ట్రమెంట్ల ద్వారా ప్రభుత్వం మార్కెట్ నుంచి రుణాలను సమీకరిస్తుంది.