న్యూఢిల్లీ: బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా)దేశాల్లో అత్యున్నత విద్య అందించే టాప్–20 వర్సిటీల్లో భారత్‌కు చెందిన నాలుగు విద్యాసంస్థలు చోటు సంపాదించాయి. ప్రతిష్టాత్మక క్వాకరెల్లీ సైమండ్స్(క్యూఎస్) సంస్థ 2017 సంవత్సరానికి విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ఐఐటీ బాంబే(9), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్–బెంగళూరు(10), ఐఐటీ ఢిల్లీ(15), ఐఐటీ మద్రాస్(18) చోటు దక్కించుకున్నాయి. చైనాకు చెందిన సింఘువా వర్సిటీ, పెకింగ్ వర్సిటీ, ఫుడాన్ వర్సిటీలు ఈ జాబితాలో తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. మొత్తం టాప్–10 విద్యాసంస్థల్లో చైనాకు చెందిన వర్సిటీలే 8 స్థానాలను కైవసం చేసుకున్నాయి.
బుధవారమిక్కడ ర్యాంకుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) చైర్మన్ వీఎస్ చౌహాన్ మాట్లాడుతూ.. సంస్థ పేరు ప్రఖ్యాతులు, అధ్యాపకులు విద్యార్థుల నిష్పత్తి, ప్రచురితమైన పరిశోధనా పత్రాలు, అందుకున్న బహుమతులు, అంతర్జాతీయ అధ్యాపకులు, విద్యార్థుల శాతం సహా 8 అంశాల ఆధారంగా ఈ సర్వే నిర్వహించినట్లు పేర్కొన్నారు. దేశంలోని టాప్–10 ప్రైవేటు విద్యాసంస్థల్లో బిట్స్ పిలానీ, థాపర్ విశ్వవిద్యాలయం, సింబియాసిస్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం, మణిపాల్ వర్సిటీ, అమృతా విశ్వవిద్యాలయం, విట్ వర్సిటీ, కళింగ యూనివర్సిటీ, ఓపీ జిందాల్ గ్లోబల్ వర్సిటీలు చోటు దక్కించుకున్నాయని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment