
'30 ఇంటర్వ్యూల్లో ఫెయిల్'
ప్రయత్నం లేకుండా ఎవరూ ప్రయోజకులు కాలేరు. ప్రయత్నాల్లో పరాజితులైతే కుంగిపోకుండా పదే పదే ప్రయత్నిస్తే ఏదో ఒకరోజు పైకి రావచ్చని వివిధ రంగాల్లో విజేతలుగా నిలిచిన కొంత మంది ఇప్పటికే నిరూపించారు. అలాంటి కోవకు చెందిన వారే ఆలీబాబా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లూజీ నికోల్‌సన్ జ్యాక్ మా. ప్రపంచ వ్యాపార దిగ్గజాల్లో ఒకరిగా, చైనాలోకెల్లా సంపన్నుడిగా పేరు ప్రఖ్యాతులు గడించిన జ్యాక్ మాకు చెందిన ఈ కామర్స్ కంపెనీ ‘ఆలీబాబా’ రోజుకు పదికోట్ల షాపర్స్‌తో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తుందంటే అతిశయోక్తి కాదు.
ఒకప్పుడు ఎక్కడా ఉద్యోగం లభించక నానా అగచాట్లు పడిన జ్యాక్ మా ఆస్తి విలువ ఇప్పుడు అక్షరాల 20.4 బిలియన్ డాలర్లంటే ఆశ్చర్యమూ కలగకమానదు. చార్లీ రోజ్ అనే రాయిటర్స్ జర్నలిస్టుకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన తన సక్సెస్ స్టోరీ గురించి వివరించారు.
'కాలేజీ ప్రవేశ పరీక్షలో మూడు సార్లు ఫెయిలయ్యాను. ఇక కాలేజీ వదిలేసి ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించాను. 30 రకాల ఉద్యోగాలకు దరఖాస్తు చేశాను. ప్రతీచోట కాదనిపించుకున్నాను. పోలీసు ఉద్యోగానికీ ప్రయత్నించాను. అక్కడా పనికిరావు పొమ్మన్నారు. చివరకు మా నగరంలోనే వెలిసిన కేఎఫ్‌సీ (కెంటకీ ఫ్రైడ్ చికెన్) రెస్టారెంట్‌కు జాబ్ కోసం దరఖాస్తు చేశాను. అక్కడా జాబ్ కోసం 24 మంది పోటీ పడ్డారు. వారిలో 23 మంది సెలక్టయ్యారు ఒక్క నేను తప్ప' అని జ్యాక్ మా వివరించారు.
ఇక అప్పుడు ఆయన తనకెవరూ ఉద్యోగం ఇచ్చేలా లేరనుకొని స్వయంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగంగానే 1998లో ఆలీబాబా కంపెనీని ఏర్పాటు చేశారు. అలా కూడా అగచాట్లు తప్పలేదు. తొలి మూడేళ్లు నయాపైసా లాభం రాలేదు. చెల్లింపులకు చేతిలో చిల్లిగవ్వా లేదు. బ్యాంకులు కూడా చేయూతనివ్వలేదు. అక్కడే ఈ చెల్లింపులకు సంబంధించి ఓ కొత్త ఆలోచన మెరుపులా మెరిసింది.
కొనుగోలుదారులు, అమ్మకందారుల మధ్య కరెన్సీ మార్పిడీ చేస్తే ఎలా ఉంటుందన్నదే ఆ ఆలోచన. ఇంతకు మించి మూర్ఖ ఆలోచన మరోటి ఉండదని కూడా ఆయన ఆలోచన విన్నవారు అప్పట్లో తిట్టిపోశారట. ప్రజలు వినియోగించుకున్నంత కాలం అది మూర్ఖ ఆలోచన అయినా ఫర్వాలేదనుకొని ఆ ఆలోచనను ‘ఆలీపే’ పేరిట కార్యరూపంలోకి తీసుకొచ్చారు. ఈ రోజున 80 కోట్ల మంది ఆలీపేను ఉపయోగిస్తున్నారంటే ఆయన విజయం ఎంత ఘనమైనదో అంచనా వేయవచ్చు.