
శబరిమల ఘటనలో క్షతగాత్రులు 31
• ఇద్దరి పరిస్థితి విషమం
• పోలీసుల తప్పేంలేదన్న మంత్రి
శబరిమల (కేరళ) : శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ఆదివారం సాయంత్రం జరిగిన తొక్కిసలాటలో 31 మంది గాయ పడ్డారని కేరళ దేవాదాయశాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ వెల్లడించారు. సన్నిధానానికి, మాలికాపురం ఆలయానికి మధ్య ఏర్పాటు చేసిన తాడుతో కట్టిన బారికేడ్లు జనాల తాకిడికి తెగిపోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో తెలం గాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు చెందినవారే అధికంగా గాయపడ్డారు. తొక్కిసలాట జరిగిన స్థలాన్ని సురేంద్రన్ పరిశీలించారు. ‘తొక్కిసలాటలో 31 మంది గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
గాయపడినవారిలో 8 మంది కొట్టాయం మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో, ముగ్గురు పతనమ్‌తిట్ట ప్రభుత్వ ఆసుపత్రిలో, ఇద్దరు పంబ, మిగిలిన 18 మంది సన్నిధానం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయంలో పోలీసుల తప్పేమీ లేదు. సన్నిధానం వద్ద చాలినంత మంది పోలీసులు ఉన్నారు’ అని చెప్పారు. భక్తుల 41 రోజుల దీక్ష సోమవారం జరగ నున్న ‘మండల పూజ’తో ముగియనున్న నేపథ్యంలో ఆదివారం ఆలయంలో రద్దీ ఎక్కువగా ఉందన్నారు. ఏపీకి చెందిన గురువమ్మ అనే మహిళ కాలికి తీవ్ర గాయం కావడంతో శస్త్రచికిత్స కొట్టాయం మెడికల్ కాలేజీ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
మహిళలను అనుమతించం
శబరిమల ఆలయంలోకి మహిళా హక్కుల కార్యకర్తలను అనుమతించమని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆలయాల్లో మహిళల హక్కుల కోసం పోరాడుతున్న భూమాత బ్రిగేడ్ అధ్యక్షురాలు తృప్తి దేశాయ్.. వంద మంది మహిళలతో శబరిమల ఆలయం లోకి ప్రవేశించాలని నిర్ణయించిన నేపథ్యంలో.. ఆమెను ఎట్టి పరిస్థితుల్లో ఆలయంలోకి ప్రవేశించనీయమని రాష్ట్ర మంత్రి సురేంద్రన్ చెప్పారు.