
యమునా నదిలో చిన్నికృష్ణయ్య
ఫతేబాద్: ఆగ్రాకు సమీపంలోని సిలావాలి గ్రామంలో అద్భుతం జరిగింది. యమునా నదిలో కొట్టుకుపోతున్న నాలుగు రోజుల పసికందును పశువుల కాపరి కాపాడాడు. స్థానిక పశువుల కాపరుల సమాచారం ప్రకారం శనివారం ఉదయం 10 గంటల సమయంలో యమునా నదిలో ఒక చిన్న బుట్ట తేలుతూ పోతోంది.. ఏమిటబ్బా అని పరికించి చూస్తే ఆ బుట్టలో పసిగుడ్డు..ఇంతలోనే సన్నగా ఏడుస్తున్నశబ్దం వినిపించింది. అంతే.. క్షణం కూడా ఆలోచించకుండా నదిలో దూకి బాబును రక్షించి, పోలీసులకు సమాచారం అందించారు. అసలు బాబు బతికి ఉన్నాడా లేడా అని భయపడ్డా.. అదృష్టవశాత్తూ పిల్లవాడు బతికే ఉన్నాడు అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు పిల్లవాడిని ఒడ్డుకు చేర్చిన రామ్జీ లాలా.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ పసిగుడ్డును పోలీసులు ఆసుపత్రికి తరలించారు. స్థానిక స్ఎన్ మెడికల్ కాలేజీలో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అయితే పిల్లవాడికి ప్రాణాపాయం లేదని.. ఎక్కువ సేపు ఎండకు, చల్లగాలికి ఎక్స్పోజ్ కావడంతో చర్మానికి అలర్జీ వచ్చిందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసి, పిల్లవాడి తల్లిదండ్రుల కోసం ఆరా తీస్తున్నామని ఫతేబాద్ ఏఎస్పీ సోమన్ బర్మా తెలిపారు. మరోవైపు ఈ చిన్ని కృష్ణయ్యను దత్తత తీసుకునేందుకు ఎస్ఎన్ మెడికల్ కాలేజీ సిబ్బందిని ఇప్పటికే చాలా మంది సంప్రదిస్తున్నారట.