సగటున ఏడాదికి దాదాపు 10 వేల తప్పుడు వరకట్న వేధింపుల కేసులు నమోదవుతున్న నేపథ్యంలో.. వాటిని అరికట్టే లక్ష్యంతో సంబంధిత చట్టంలో సవరణలు తేవాలని ప్రభుత్వం యోచిస్తోంది.
న్యూఢిల్లీ: సగటున ఏడాదికి దాదాపు 10 వేల తప్పుడు వరకట్న వేధింపుల కేసులు నమోదవుతున్న నేపథ్యంలో.. వాటిని అరికట్టే లక్ష్యంతో సంబంధిత చట్టంలో సవరణలు తేవాలని ప్రభుత్వం యోచిస్తోంది. జస్టిస్ మాలిమత్ కమిటీ, లా కమిషన్‌లు సూచించిన విధంగా.. భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ 498(ఏ)ను మార్చి, వరకట్న వేధింపులను ‘కోర్టు అనుమతితో రాజీకి వీలు కలిగించే నేరం’గా మార్చాలని ఆలోచిస్తోంది. కేసు విచారణలో ఉండగానే.. భార్యాభర్తలు రాజీ పడేందుకు వీలు కల్పించే నిబంధనలను సెక్షన్ 498(ఏ)కు జోడించాలనుకుంటోంది.
వరకట్న వేధింపులను ఐపీసీ 498(ఏ) కింద వరకట్న వేధింపులు, అత్తింటి ఆరళ్లను ప్రస్తుతం రాజీకి వీల్లేని, బెయిల్‌కు అవకాశంలేని, తక్షణమే నిందితుడిని అరెస్ట్ చేసేందుకు వీలు కల్పించే నేరంగా పరిగణిస్తున్న విషయం తెలిసిందే. నేరం రుజువైతే, గరిష్టంగా మూడేళ్ల వరకు జైలు శిక్ష పడ్తుంది. ఈ కఠిన నిబంధనలను అడ్డుగా పెట్టుకుని.. చిన్నచిన్న తగాదాలకు, వ్యక్తిగత కక్ష సాధింపులకు ఈ సెక్షన్‌ను ఆయుధంగా వాడుకుంటున్నారన్న ఆరోపణలు వస్తుండటం, ఈ విషయాన్ని సుప్రీంకోర్టు కూడా ఒక సందర్భంలో ప్రస్తావించడం జరిగిన నేపథ్యంలో.. చట్టంలో మార్పులు చేయాలని కేంద్రం యోచిస్తోంది.
సెక్షన్ 498(ఏ)కు సంబంధించి 2011లో నమోదైన మొత్తం 99,135 కేసుల్లో 10,193, 2012లో నమోదైన 1,06,527 కేసుల్లో 10,235, 2013లో నమోదైన 1,18,866 కేసుల్లో 10,864 కేసులు తప్పుడు కేసులుగా పోలీసుల విచారణలో తేలింది. 498(ఏ)ను రాజీకి వీలున్న నేరంగా మారిస్తే రాజీకీ, కోర్టు వెలుపలి సర్దుబాటుకు వీలు కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.