
న్యూఢిల్లీ: తొలుత కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డ 15 రాష్ట్రాల్లోని 25 జిల్లాలను కంటైన్మెంట్ చేయడంతో మంచి ఫలితాలు వచ్చాయని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ సోమవారం మీడియా సమావేశంలో చెప్పారు. ఆ 25 జిల్లాల్లో గత 14 రోజుల్లో కొత్తగా ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. జిల్లాల్లో అధికార యంత్రాంగం కృషితోనే ఈ ఘనత సాధ్యమైందని ప్రశంసించారు. ఇందులో తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సైతం ఉందన్నారు. ఆయా జిల్లాల్లో భవిష్యత్తులోనూ కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు.
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన ప్యాకేజీ కింద ఏప్రిల్ 10వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా పేదలకు రూ.28,256 కోట్ల ఆర్థిక సహాయం అందజేసినట్లు లవ్ అగర్వాల్ చెప్పారు. అలాగే పీఎం కిసాన్ యోజన కింద రైతులకు రూ.13,855 కోట్లు అందజేశామన్నారు. సామాజిక సాయం కింద వితంతువులు, వయో వృద్ధులు, దివ్యాంగులకు రూ.1,405 కోట్లు బదిలీ చేశామని తెలిపారు. రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి పథకం కింద 27 రాష్ట్రాల్లో 78,373 స్వయం సహాయక బృందాల సభ్యులు 1.96 కోట్ల ఫేసు మాస్కులను తయారు చేశారని అన్నారు. ఆరు వారాల పాటు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడానికి అవసరమైన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) వెల్లడించింది. దేశంలో ఇప్పటిదాకా 2,06,212 పరీక్షలు నిర్వహించినట్లు తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment