న్యూఢిల్లీ: ఈసారి పద్మ అవార్డుల ఎంపికకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చిందని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 2014లో తొలిసారి ప్రజల నుంచి నామినేషన్లను ఆహ్వానించినప్పుడు 2,200 మాత్రమే కాగా, 2019లో ఆ సంఖ్య 50,000కు చేరుకుందని వ్యాఖ్యానించారు. సమాజంపై, ప్రజల జీవితాలపై గొప్ప ప్రభావం చూపిన వేర్వేరు రంగాలకు చెందిన నిపుణులు, వ్యక్తులకు ఈసారి అవార్డులు వరించాయని అభిప్రాయపడ్డారు. ఈసారి తొమ్మిది రాష్ట్రాలకు చెందిన 12 మంది రైతులు పద్మ అవార్డులను అందుకున్నారు.
వీరిలో అత్యాధునిక పద్ధతులు సాంకేతికత పాటించినందుకు భారత్ భూషణ్ త్యాగి, రామ్‌శరణ్ వర్మతో పాటు సంప్రదాయ సేంద్రియ వ్యవసాయం చేస్తున్న కమలా పూజారీ, రాజ్‌కుమారీ దేవి, బాబూలాల్ దహియా, హుకుమ్‌చంద్ పటీదార్ ఉన్నారు. వీరితో పాటు కన్వల్ సింగ్ చౌహాన్(మష్రూమ్, మొక్కజొన్న సాగు), వల్లభ్‌భాయ్ వస్రమ్‌భాయ్(క్యారట్ సాగు), జగదీశ్ ప్రసాద్(క్యాలీఫ్లవర్), సుల్తాన్ సింగ్(చేపల పెంపకం), నరేంద్ర సింగ్(పాడిపశువుల పునరుత్పత్తి)లకు పద్మ అవార్డులు దక్కాయి. వైద్య రంగానికి సంబంధించి 11 రాష్ట్రాల నుంచి 14 మంది వైద్యులను కేంద్ర పద్మ అవార్డులతో సత్కరించింది. పేదలకు నామమాత్రపు ఫీజుకే, కొన్నిసార్లు ఉచితంగా చికిత్స అందజేస్తున్న శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ(జార్ఖండ్), స్మిత, రవీంద్ర కోల్హే(మహారాష్ట్ర), ఆర్వీ రమణి(తమిళనాడు)లకు పద్మ అవార్డులు వరించాయి.
దేశంలోని మారుమూల ప్రాంతాల్లో సేవలను కొనసాగిస్తున్న సెరింగ్ నోర్బూ(లడఖ్), ఇలియాజ్ అలీ(అస్సాం), అశోక్ లక్ష్మణ్‌రావ్ కుకడే(లాతూర్–మహారాష్ట్ర) పద్మ పురస్కారాలను దక్కించుకున్నారు. వీరితో పాటు ప్రతిష్టాత్మక వైద్య సంస్థలకు చెందిన జగత్‌రామ్(పీజీఐఎంఈఆర్ డైరెక్టర్–చండీగఢ్), షాదాబ్ మొహమ్మద్(కింగ్ జార్జ్ ఆరోగ్య విశ్వవిద్యాలయం–లక్నో), సందీప్ గులేరియా(ఎయిమ్స్–ఢిల్లీ), మమ్మెన్ చాందీ(టాటా మెడికల్ సెంటర్ డైరెక్టర్–కోల్‌కతా) పద్మ అవార్డులను అందుకున్నారు. పద్మ పురస్కారాలు పొందినవారిలో సోషలిస్ట్ నేత హుకుమ్‌దేవ నారాయణ్ యాదవ్, గిరిజన నేత కరియాముండా, సిక్కు నేత సుఖ్‌దేవ్ సింగ్, మహాదళిత్ మహిళా నేత భగీరథి దేవి, 1984 అల్లర్ల బాధితుల తరఫున పోరాడుతున్న లాయర్ హర్విందర్ సింగ్ ఫూల్కా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment