దేశంలో స్వైన్ఫ్లూ మరణాలు 841!
దేశంలో ఈ ఏడాది ఇప్పటివరకు 841 మంది స్వైన్ ఫ్లూతో మరణించారు. ఇది చాలా ఆందోళనకరమైన విషయమని, పరిస్థితిని తాము నిశితంగా పరిశీలిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. ఈ అంశంపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పార్లమెంటులో ప్రకటన చేశారు. జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 22 వరకు మొత్తం 14,673 మందికి స్వైన్ ఫ్లూ సోకిందని తెలిపారు.
ఈ వ్యాధి చికిత్సకు ఉపయోగించే ఓసెల్టామివిర్ అనే మందు కొరతగా ఉందన్న వాదనను ఆయన తిరస్కరించారు. దాన్ని భారతదేశంలోనే తయారుచేస్తున్నారని మంత్రి జేపీ నడ్డా చెప్పారు. అయితే దీన్ని నేరుగా కౌంటర్లలో అమ్మడంలేదని, కేవలం వైద్యుల ప్రిస్క్రిప్షన్ ఉంటేనే అమ్ముతున్నారని తెలిపారు. మందును ఇష్టారాజ్యంగా ఉపయోగిస్తే వైరస్ దానికి లొంగకుండా పోయే ప్రమాదం ఉన్నందున ముందునుంచి జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.