
కశ్మీర్‌లో మళ్లీ హింస
జమ్మూకశ్మీర్ మరోసారి ఆందోళనలతో అట్టుడికింది. శనివారం బుడ్గాం జిల్లాలోని నర్బల్‌లో ఆందోళనకారులపై సీఆర్పీఎఫ్ జవాన్లు జరిపిన కాల్పుల్లో ఓ బాలుడు(16) మృతిచెందడం దుమారానికి దారితీసింది. ఈ ఉదంతంలో జవాన్ల తప్పిదం ఉందంటూ పోలీసులు ఆరోపించడంతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం కాల్పుల ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది. కాల్పులకు సంబంధించి ఇద్దరు పోలీసులను అరెస్ట్ చేశారు. బాలుడి మృతికి నిరసనగా నర్బల్ వరకూ ర్యాలీ చేపట్టేందుకు ప్రయత్నించినజేకేఎల్‌ఎఫ్ చైర్మన్ యాసిన్ మాలిక్, సామాజికవేత్త స్వామి అగ్నివేశ్‌లను పోలీసులు కాసేపు అదుపులోకి తీసుకొని విడిచిపెట్టారు.
- ఆందోళనకారులపై జవాన్ల కాల్పుల్లో బాలుడి మృతి
- పట్టుకొని కాల్చి చంపారన్న మృతుని కుటుంబ సభ్యులు
- జవాన్లపై హత్య కేసు నమోదు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ జవాన్ల అత్యుత్సాహం ఓ బాలుడిని బలితీసుకుంది. నిరసన ప్రదర్శనలో పాల్గొనడమే శాపమై అతని మరణానికి కారణమైంది. రాష్ట్రంలో గతవారం జరిగిన సైనిక ఆపరేషన్‌లో ఇద్దరు యువకుల మృతి ఉదంతంతోపాటు వేర్పాటువాద నేత మసరత్ ఆలం అరెస్టును నిరసిస్తూ హురియత్ కాన్ఫరెన్స్ శనివారం పిలుపునిచ్చిన బంద్ సందర్భంగా బుడ్గాం జిల్లాలో హింస చోటుచేసుకుంది. జిల్లాలోని నర్బల్ వద్ద వీధుల్లో నిరసనలకు దిగిన ఆందోళనకారులను అదుపు చేసేందుకు సీఆర్పీఎఫ్ జవాన్లు కాల్పులు జరపగా సుహైల్ అహ్మద్ సోఫీ అనే 16 ఏళ్ల బాలుడితోపాటు మరో ఇద్దరు గాయపడ్డారు. దీంతో స్థానికులు వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బాలుడు మృతిచెందాడు. అయితే సీఆర్పీఎఫ్ జవాన్లు ‘స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్’ పాటించలేదంటూ ప్రాథమిక విచారణలో తేల్చిన పోలీసులు ఇందుకు బాధ్యులపై హత్య కేసు నమోదు చేశారు.
కాల్పులకు సంబంధించి ఇద్దరు పోలీసులను అరెస్ట్ చేశారు. బాలుడిని ప్రశ్నించేందుకంటూ అదుపులోకి తీసుకున్న జవాన్లు అనంతరం పాయింట్ బ్లాంక్ రేంజ్‌లోకాల్చి చంపారని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాలుడి మృతి వార్త దావానలంలా వ్యాపించడంతో ఆందోళనకారులు పేట్రేగిపోయారు. భద్రతా దళాలపై రాళ్లు రువ్వడంతోపాటు ఓ పోలీస్ పికెట్‌కు నిప్పుపెట్టారు. టైర్లు కాల్చి రోడ్లకు అడ్డంగా పడేశారు. పలుచోట్ల వాహనాలను ధ్వంసం చేశారు. బారాముల్లా జిల్లాలోని పట్టాన్, ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారాలోనూ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. జవాన్ల కాల్పుల ఉదంతాన్ని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం దీనిపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి 15 రోజుల్లోగా బద్గాం జిల్లా మేజిస్ట్రేట్‌కు నివేదిక సమర్పించాల్సిందిగా అదనపు డీసీపీకి ఆదేశాలు జారీ చేసింది. బాలుడి మరణవార్త తెలియడంతో నర్బల్ వరకూ నిరసన ర్యాలీ చేపట్టేందుకు ప్రయత్నించిన జేకేఎల్‌ఎఫ్ చైర్మన్ యాసిన్ మాలిక్, సామాజికవేత్త స్వామి అగ్నివేశ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకొని అనంతరం వదిలేశారు.
రాష్ట్రంలో కశ్మీరీ పండిట్లకు ప్రత్యేక కాలనీల ఏర్పాటు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మాలిక్ శనివారం ప్రారంభించిన 30 గంటల నిరాహారదీక్షకు మద్దతు పలికేందుకు అగ్నివేశ్ శ్రీనగర్ చేరుకున్నారు. అంతకుముందు బంద్ సందర్భంగా పోలీసులు హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ ఉమర్ ఫరూఖ్ సహా మరికొందరు మంది వేర్పాటువాద నేతలను గృహ నిర్బంధంలో ఉంచారు. హురియత్ ఫ్యాక్షన్ నేతఅలీ షా గిలానీని గురువారం నుంచే హౌస్ అరెస్ట్ చేశారు. బంద్ సందర్భంగా ఆందోళనకారులు, భద్రతా దళాల మధ్య పలుచోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో దుకాణ, వాణిజ్య సముదాయాలన్నీ మూతబడ్డాయి. ప్రజా రవాణా కూడా స్తంభించింది.