
దీక్షలో ఉండే మూడుముళ్లు వేశాడు!
జైపూర్: నిరాహార దీక్ష శిబిరమే వివాహ వేదికగా మారింది. రిజర్వేషన్ కోటా అమలు చేయాలనే డిమాండ్‌తో దీక్షలో కూర్చున్న యువకుడు.. అక్కడే ఓ యువతి మెడలో మూడుముళ్లు వేశాడు. అనంతరం అతడు తన దీక్ష కొనసాగించగా నూతన వధువు అత్తవారింటికి వెళ్లిపోయింది. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. దౌసా జిల్లా సికిందరా ఏరియాకు చెందిన దేవరాజ్ గుజ్జర్(26)తో పాటు మరో పది మంది గత ఏడాది రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలో ఎస్‌బీసీ కోటా కింద లెక్చరర్ల పోస్టులకు ఎంపికయ్యారు.
ఇంతలోనే.. ప్రత్యేక వెనుకబడిన కులాల(ఎస్‌బీసీ) వారికి రిజర్వేషన్ రద్దుచేస్తూ రాజస్థాన్ హైకోర్టు తీర్పు వెల్లడించింది. దీంతో లెక్చరర్ల పోస్టుకు ఎంపికైన వీరికి కాల్ లెటర్లు అందలేదు. దీంతో వారు ఈ ఫిబ్రవరి 16వ తేదీ నుంచి ఆమరణ నిరాహార దీక్షకు చేస్తున్నారు. దేవరాజ్ గుజ్జర్‌కు మమత అనే యువతితో ఎనిమిది నెలల క్రితమే వివాహం నిశ్చమయింది. ఈ ఫిబ్రవరిలోనే వివాహం కావాల్సి ఉంది. తమ రిజర్వేషన్ కోటా కోసం దీక్ష చేస్తున్న దేవరాజ్ సూచన ప్రకారం.. దీక్ష శిబిరం వద్దే పెద్దలు వివాహ వేదిక ఏర్పాటు చేశారు. బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి తంతు జరిపించారు.
తన వివాహం అనంతరం దేవరాజ్ గుజ్జర్ మీడియాతో మాట్లాడాడు. ఎస్‌బీసీ కోటా రిజర్వేషన్లు తిరిగి అమలయ్యేలా దాకా దీక్ష కొనసాగిస్తానని చెప్పాడు. ఈ డిమాండ్ కోసం ప్రాణం పోయినా పరవాలేదని తెలిపాడు. నూతన వధువు మమత మాట్లాడుతూ... ఈ పరిస్థితుల్లో తన భర్త దీక్ష చేపట్టడం కాస్త ఇబ్బంది కలిగించే విషయం అయినప్పటికీ ఆయన ఒక మంచి ఆశయ సాధనకు దీక్ష చేపట్టడం గర్వంగా ఉందని తెలిపింది. ప్రభుత్వం స్పందించకుంటే తాను కూడా దీక్షలో కూర్చుంటానని చెప్పింది. అనంతరం వధువు మమత అత్తవారింటికి వెళ్లిపోగా దేవరాజ్ మాత్రం దీక్షలో కూర్చున్నాడు.