మహిళా జడ్జిపై అత్యాచారం.. హత్యాయత్నం
ఉత్తరప్రదేశ్లో మహిళలు ఎంత ఉన్నతస్థానంలో ఉన్నా కూడా వారికి ఏమాత్రం రక్షణ ఉండట్లేదు. చివరకు ఓ మహిళా జడ్జిని కూడా అక్కడి ముష్కరులు వదల్లేదు. అలీగఢ్లో ఓ మహిళా జడ్జిపై అత్యాచారం చేయడమే కాక, ఆమెపై హత్యాయత్నం కూడా చేశారు. ఆమె తన అధికారిక నివాసంలో స్పృహ లేకుండా పడి ఉన్నారు. ఆమెకు విపరీతంగా డ్రగ్స్ ఇచ్చి, ఆపై అత్యాచారం చేశారు. ఆమె శరీరంపై లెక్కలేనని్న గాయాలున్నాయి. బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు అత్యాచారం కేసు నమోదు చేసినట్లు సీనియర్ ఎస్పీ నితిన్ తివారీ తెలిపారు.
బాధితురాలు ఇంకా పూర్తిగా స్పృహలోకి రాకపోవడంతో ఇంకా ఆమెకు వైద్య పరీక్షలు ఏమీ చేయలేదని, ఆమెను విచారించే స్థితిలోకి వచ్చిన తర్వాతే చేయిస్తామని ఆయన అన్నారు. సగం ఖాళీ అయిన పురుగుమందు సీసా కూడా సంఘటన స్థలంలో ఉందని అధికారులు చెప్పారు. బహుశా భయంతోనే దుండగులు ఆమెకు బలవంతంగా పురుగుమందు తాగించి ఉంటారని అన్నారు. మహిళా జడ్జి పరిస్థితి ఇంకా విషమంగానే ఉండటంతో.. ఆమెను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.