ఎటా (యూపీ): ఉత్తరప్రదేశ్‌లో మరో మైనర్ బాలికపై ఘోరం జరిగింది. అభం శుభం తెలియని ఏడేళ్ల చిన్నారిపై దుండగుడు అత్యాచారం చేసి ఆపై హత్యకు ఒడిగట్టడం తీవ్ర కలకలం రేపుతోంది. బంధువుల పెళ్లి వేడుకకు వచ్చిన ఏడేళ్ల బాలికపై షామియానాలు వేసే వ్యక్తి అత్యాచారం జరిపి అనంతరం తాడుతో గొంతు బిగించి హత్య చేసినట్లు పోలీసులు చెప్పారు.
కేసులో నిందితుడిపై పోక్సో (లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ), తదితర చట్టాల కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు బాధితురాలి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎటా–ఫరూఖాబాద్ రహదారిని దిగ్బంధించారు.
మభ్యపెట్టి అర్ధరాత్రి..
పోలీసుల కథనం ప్రకారం ఎటా జిల్లాలోని అలీగంజ్ రోడ్డుపై ఉన్న మండి సమితి గేట్ వద్ద జరుగుతున్న పెళ్లికి బాలిక హాజరైంది. షామియానాలు వేసే సోనూ జాటవ్ (19) అనే వ్యక్తి ఆమెను మభ్యపెట్టి సోమవారం అర్ధరాత్రి సమయంలో రేప్ చేశాడు. తర్వాత బాలిక గొంతుకు తాడు బిగించి చంపేశాడని జిల్లా ఎస్పీ అఖిలేశ్ చెప్పారు. పెళ్లి వేదికకు దగ్గర్లో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటిలో బాలిక మృతదేహం లభ్యమైందని ఆయన తెలిపారు.
ఆ తర్వాత బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సోనూ జాటవ్‌ను పోలీసులు ఎన్‌ఎస్‌ఏ చట్టం కింద అరెస్టు చేశారన్నారు. ఈ చట్టాన్ని సాధారణంగా దేశ భద్రతకు, శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై ప్రయోగిస్తారు. బెయిలు ఇవ్వకుండా, కోర్టులో విచారణకు హాజరుపరచకుండా, ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారో కూడా బయటకు చెప్పకుండానే ఈ చట్టం కింద అరెస్టు చేయొచ్చు.
బీజేపీపై ప్రతిపక్షాల విమర్శలు..
ఉన్నావ్‌లోనూ మైనర్ బాలికపై అధికార బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ అత్యాచారం జరపడంతోపాటు.. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె తండ్రినే అరెస్టు చేసి లాకప్‌లో హింసించి చంపేశారని ఆరోపణలు ఉండటం తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లో నేరాలు పెరిగిపోతుండటంపై ప్రతిపక్ష సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీలు ప్రభుత్వంపై విమర్శల దాడి చేశాయి.
సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్సీ సునీల్ సింగ్ మాట్లాడుతూ ‘యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చాక శాంతి భద్రతలు ఎందుకు క్షీణిస్తున్నాయో అర్థం కావడం లేదు. ఒకవైపు నేరగాళ్లను ఎన్‌కౌంటర్ చేయడంలో తాము దూసుకెళ్తున్నామని ప్రభుత్వం చెప్పుకుంటోంది. మరోవైపు నేరాల సంఖ్య పెరిగిపోతూనే ఉంది.
శాంతి భద్రతలను మెరుగుపరుస్తామని బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు మాటిచ్చింది. ఇప్పుడు మైనర్ బాలికలకూ రక్షణ లేకుండా పోతోంది’అని విమర్శించారు. నేరస్తులు రాష్ట్రంలో స్వేచ్ఛగా జీవిస్తున్నారనీ, నేరాల సంఖ్య పెరుగుతున్న రాష్ట్రాల్లో యూపీ తొలిస్థానంలో నిలుస్తోందని కాంగ్రెస్ దుయ్యబట్టింది.
అక్కా చెల్లెళ్ల హత్య
ఇటావా: యూపీలోని ఇటావా జిల్లాలోనూ అక్కాచెల్లెళ్లైన ఇద్దరిని గుర్తుతెలియని దుండగులు తుపాకీతో కాల్చి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన బస్రేహర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం జరిగినట్లు సీనియర్ ఎస్పీ అశోక్ చెప్పారు. పెద్ద అమ్మాయికి 19 ఏళ్లనీ, తన మైనర్ చెల్లెలితో కలసి ఆమె ఓ పొలంలోకి బహిర్భూమికి వెళ్లినప్పుడు ఈ హత్యలు జరిగినట్లు ఆయన చెప్పారు.
సాయంత్రం వాళ్లు పొలంలోకి వెళ్లినా ఎంతసేపటికీ రాకపోవడంతో పొరుగింట్లో జరుగుతున్న పెళ్లికి వెళ్లి ఉంటారని కుటుంబ సభ్యులు భావించారనీ, రాత్రయినా రాకపోవడంతో పొలంలో వెతకడంతో వారి మృతదేహాలు లభించాయని ఆయన వివరించారు. పోస్టుమార్టమ్‌లో వెల్లడైన వివరాల ప్రకారం వారిపై లైంగిక దాడి ఏదీ జరగలేదని తెలిపారు. ప్రేమ ప్రతిపాదనను నిరాకరించడంతోనే వీరిని హత్య చేసి ఉండొచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment