ఉన్మాద చర్య! | its a Sadistic game! | Sakshi
Sakshi News home page

ఉన్మాద చర్య!

Published Sat, Jun 7 2014 11:36 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

its a Sadistic game!

సంపాదకీయం
 
 మహారాష్ట్రలోని పూణె నగరానికి ఒక ప్రత్యేకత ఉన్నది. దేశంలోని అన్ని రాష్ట్రాలనుంచి మాత్రమే కాదు... వివిధ దేశాలనుంచి సైతం వేల సంఖ్యలో యువతీయువకులు ఏటా మంచి చదువుల కోసం, ఉపాధి కోసం అక్కడికి వస్తుంటారు. ఆ నగరాన్ని ఆలంబనగా చేసుకుని నిలదొక్కుకోవడానికి, మెరుగైన జీవితం పొందడానికి, ఉన్నతస్థాయికి ఎదగడానికి ప్రయత్నిస్తారు. ఆ రకంగా అది అవకాశాల నగరం, ఆశా వహుల నగరం. భిన్న భావాలకూ, సంస్కృతులకూ వేదిక. అలాంటి చోట ఒక యువ ఐటీ రంగ నిపుణుడు మొహిసిన్ సాదిక్ షేక్ కొందరు ఉన్మాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయాడు. హాకీ స్టిక్‌లతో వచ్చిన 20మంది వారంక్రితం మూకుమ్మడిగా దాడిచేసి తీవ్రంగా గాయపరి చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మూడురోజులక్రితం ఆ యువ కుడు మరణించాడు.
 
 
 ఈ దాడికి పాల్పడినవారికీ, సాదిక్ షేక్‌కూ మధ్య వ్యక్తిగత తగాదాలు లేదా విద్వేషాలు లేవు. అసలు అతడెవరో, ఏం చేస్తుంటాడో కూడా దాడి చేసినవారికి తెలియదు. ముస్లింగా గుర్తు పట్టేలా ఉన్నందువల్ల మాత్రమే అతన్ని కొట్టి చంపారని పోలీసులు చెబుతున్న మాట. మార్ఫింగ్‌చేసిన ఛత్రపతి శివాజీ చిత్రాలు ఫేస్ బుక్‌లో చక్కర్లు కొడుతున్న కారణంగా ఉద్రిక్తతలు అలుముకున్నా యని, దీనికితోడు శివాజీ విగ్రహంపై రాళ్లు రువ్వినట్టు వదంతులు బయల్దేరాయని, పర్యసానంగా సాదిక్ షేక్‌పై దాడి జరిగిందని వారం టున్నారు. అరెస్టయినవారంతా స్థానికంగా పనిచేస్తున్న హిందూ రాష్ట్ర సేనకు చెందినవారు.  
 
 విద్వేషం దృష్టిని మసకబారుస్తుంది. ఉన్మాదానికి దారితీస్తుంది. దానికి హేతువుతో పనిలేదు. ఎదుటనున్నది ఎవరన్న విచక్షణ లేదు. ఇలాంటి విద్వేషానికి వదంతులు తోడైతే దానికిక పట్టపగ్గాలుండవు. పూణెలో జరిగింది అదే. తమ విశ్వాసానికో, తాము గాఢంగా ప్రేమి స్తున్న నాయకుడికో అపచారం జరిగిందని వదంతులు వెలువడిన ప్పుడు లేదా సోషల్ నెట్‌వర్క్‌లో వారిని జుగుప్సాకరమైన రీతిలో చిత్రీ కరించారని, అవమానకరమైన పద్ధతుల్లో విమర్శించారని అనుకున్నప్పుడు పోలీసు లకు ఫిర్యాదుచేయడం బాధ్యతగలవారు చేసే పని. కొందరు దుండగులవల్ల సమాజంలో సామరస్యానికి విఘాతం కలుగుతున్నదని భావించేవారు, సమాజక్షేమంపట్ల ఆందో ళన ఉన్నవారు మొట్టమొదట చేయవలసింది అదే. మానసిక ఆరోగ్యం సరిగ్గా ఉండేవారు అలాగే చేస్తారు. అంతేతప్ప మారణాయుధాలు ధరించి వీరంగం వేయరు. వదంతులు ఎంతటి ప్రమాదాన్ని తెచ్చిపెడ తాయో చెప్పడానికి చాలా ఉదాహరణలున్నాయి. రెండేళ్లక్రితం అసోం లో బయలుదేరిన వదంతులు పలు జిల్లాల్లో బోడోలకూ, మైనారిటీ వర్గాలకూ మధ్య ఘర్షణలకు కారణమై ఎందరో మరణించారు. వేల సంఖ్యలో గృహదహనాలు సాగాయి. ఏణ్ణర్ధంక్రితం దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన ఈశాన్య ప్రాంతవాసులు భారీ సంఖ్యలో స్వస్థ లాలకు తరలివెళ్లడం కూడా ఇలాంటి వదంతుల పర్యవసానమే. ఇవన్నీ మారుమూల పల్లెటూళ్లలోనో, మనమంతా ‘అనాగరిక సమా జాలు’గా ముద్రవేసే ప్రాంతాల్లోనో జరుగుతాయనుకుంటాం. మహాన గరాలుగా, నాగరికతకు ఆనవాళ్లుగా చెప్పుకుంటున్నచోట విశాల దృక్ప థమూ, ఉదారవాద భావాలూ ఉంటాయని, నిత్యమూ అక్కడ రెప్ప వాల్చని నిఘా కూడా ఉంటుందని భావిస్తాం. కానీ, పూణెవంటి చోట ఎవరో ఆకతాయిలు సోషల్ నెట్‌వర్క్‌లో మార్ఫింగ్‌కు పాల్పడటం, ఆ వెనకే కొన్ని వదంతులు వెలువడటం... వెనువెంటనే వాటితో ఏమా త్రమూ సంబంధంలేని యువకుడొకరు ప్రాణాలు కోల్పోవడం ఎంత ఘోరం!
 
 సమాజమంతా తలదించుకోవాల్సిన ఈ నేరంపై కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం స్పందనే అంతంతమాత్రంగా ఉన్నదని, చర్యలు తీసుకోవడంలో ఎడతెగని జాప్యం చేసిందని విమర్శలు వచ్చాయి. అయితే, స్థానిక బీజేపీ ఎంపీ అనిల్ షిరోల్ ఈ ఉదంతంపై మాట్లాడిన తీరు మరింత దారుణంగా ఉంది. ఫేస్‌బుక్‌లో వచ్చిన చిత్రాలు బాధాకరమైనవని, అందుకు ఇలాంటి పర్యవసానాలు సహజమేనని ఆయన వ్యాఖ్యానించారు. దుండగులు వీధుల్లో వీరంగం వేయడం, సంబంధంలేనివారిపై దాడులకు దిగి ఒక యువకుడిని బలి గొనడం ‘సహజమే’నని ఆయన ఎలా అనగలిగారో ఆశ్చర్యం కలిగి స్తుంది.  పూణె ఉదంతంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కన బడుతుండగా, దాన్ని వేలెత్తిచూపి తన నియోజకవర్గంలో అశాంతిని రేకెత్తించడానికి కారకులైనవారిని కట్టడిచేయమని ఆ ఎంపీ డిమాండ్ చేయాలి. కానీ, ఆయన సైతం దుండగులను సమర్ధించేలా మాట్లా డటం విచారకరం. సార్వత్రిక ఎన్నికల్లో కులమతాలకు అతీతంగా ప్రజలు బీజేపీకి ఓటువేశారు. ముఖ్యంగా యువత నరేంద్ర మోడీ అభి వృద్ధి నినాదానికి ఆకర్షితులయ్యారు. అందుకు తగ్గట్టుగానే మోడీ ప్రభు త్వ పగ్గాలు చేపట్టినరోజునుంచే వరస చర్యలు ప్రారంభించారు. ఆ చర్యలు అందరిలోనూ విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగిస్తున్నాయి.
 
 ఎన్ని కల ప్రచారపర్వంలో మోడీపైన కాంగ్రెస్, ఇతర పార్టీలు చేసినదంతా దుష్ర్పచారమేనన్న భావమూ ఏర్పడుతున్నది.  ఈ ఉదంతంలో సైతం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ చురుగ్గా స్పందించి ఏం జరిగిందో తెలుసు కోవడానికి ప్రయత్నించింది. ఇలాంటి దశలో బీజేపీ ఎంపీ చేసిన వ్యా ఖ్యానం అందరినీ దిగ్భ్రాంతిపరుస్తుంది. మైనారిటీ వర్గాల్లో అభద్రతా భావాన్ని రేకెత్తిస్తుంది. పూణె ఉదంతంలో అసహనంతో, ఉన్మాదంతో రెచ్చిపోయి దాడులకు దిగిన సంస్థలను, వ్యక్తులను కట్టడిచేయడంలో ఏమాత్రం అలసత్వాన్ని ప్రదర్శించినా అది ప్రతీకారేచ్ఛను పెంచు తుంది. సమాజశ్రేయస్సుకు ఇది ఎంత మాత్రమూ దోహదపడదని అన్ని పక్షాలు గుర్తించాలి. ఈ ఉన్మాదాన్ని మొగ్గలోనే తుంచాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement