న్యూఢిల్లీ: చిన్న, సన్నకారు రైతులకు తోడ్పాటు అందించేందుకు ఏర్పాటుచేసిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకం కింద ఆర్థిక సాయం అందాలంటే ఆధార్ నంబర్ తప్పనిసరిగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రైతులు తమ గుర్తింపు కార్డు కింద ఆధార్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మార్చి నెలలో ఇచ్చే తొలి విడతలో మాత్రం ఇది ఐచ్ఛికమేనని (ఆప్షనల్) పేర్కొంది. తొలి విడత నగదు పొందేందుకు ఆధార్‌కు బదులుగా డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ కార్డు, కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన ఏదైనా గుర్తింపు కార్డు ఉంటే సరిపోతుంది. రెండో విడత నుంచి నగదు పొందాలంటే ఆధార్ నంబర్ ఉండాల్సిందే. దీనికి సంబంధించి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు సోమవారం లేఖ రాసింది.
పీఎం కిసాన్‌కు అర్హుల జాబితాను వీలైనంత త్వరగా సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఫిబ్రవరి 1 నాటికి భూరికార్డుల్లో పేర్లు నమోదైన యజమానులే ఈ పథకానికి అర్హులని స్పష్టం చేసింది. రైతుకు ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో భూములు ఉన్నట్లు గుర్తిస్తే.. ఆ భూములన్నింటిని కలిపి పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. అలాగే పీఎం కిసాన్ పథకం అమలుకు సంబంధించి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడానికి జిల్లా స్థాయిలో ఫిర్యాదుల పరిష్కార సంఘాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ పథకం అమలుకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో నోడల్ యూనిట్లను, కేంద్ర స్థాయిలో పర్యవేక్షణ విభాగాలను కేంద్రం ఏర్పాటు చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment