
ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు శివసేన యువజన విభాగం అధ్యక్షుడు, బాల్‌థాకరే మనవడు ఆదిత్య థాకరే నిర్ధారించారు. శివసేనకు సురక్షిత స్ధానంగా పరిగణించే వొర్లి స్ధానం నుంచి ఆదిత్య పోటీ చేయనున్నారు. సోమవారం ముంబైలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గతంలో బాలాసాహెబ్‌కు ఆ తర్వాత మా తండ్రి ఉద్దవ్‌కు ప్రేమాభిమానాలు అందించిన మీరు అదే ప్రేమను తన యాత్ర సందర్భంగా కొద్దిరోజులుగా తనపై కురిపించిన తీరు ముదావహమని అన్నారు. తాను వొర్లి నుంచి పోటీ చేస్తున్నా యావత్ మహారాష్ట్ర తన కర్మభూమిగా ఉంటుందని ఆదిత్య స్పష్టం చేశారు. తాను ఎమ్మెల్యే, మంత్రి, లేదా ముఖ్యమంత్రి కావాలనే కోరికతో పోటీ చేయడం లేదని, ప్రజలకు సేవ చేసేందుకే పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. దివంగత బాల్‌థాకరే శివసేనను 1966లో స్ధాపించినప్పటి నుంచి థాకరే కుటుంబం నుంచి ఏ ఒక్కరూ పోటీ చేయడం, రాజ్యాంగ పదవిని చేపట్టడం జరగలేదు. థాకరే కుటుంబం నుంచి తొలిసారిగా ఆదిత్య థాకరే ఎన్నికల బరిలో నిలవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment