ఓటమిని ఒప్పుకున్నట్లనిపిస్తోంది | AAP seems to have conceded defeat, says Delhi BJP chief Satish Upadhyay | Sakshi
Sakshi News home page

ఓటమిని ఒప్పుకున్నట్లనిపిస్తోంది

Published Sun, Nov 9 2014 10:12 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM

ఓటమిని ఒప్పుకున్నట్లనిపిస్తోంది - Sakshi

ఓటమిని ఒప్పుకున్నట్లనిపిస్తోంది

న్యూఢిల్లీ: ఆరుగురు మాజీ శాసనసభ్యులకు త్వరలో జరగనున్న ఎన్నికల్లో టికెట్లు ఇవ్వకపోవచ్చనే వార్తల నేపథ్యంలో కమలదళం.. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)పై చెణుకులు విసిరింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తన ఓటమిని అంగీకరిస్తుందనడానికి  ఈ యోచనే ఓ సంకేతమంది. షహధారా ప్రాంతంలో ఆదివారం జరిగిన పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో బీజేపీ రాష్ర్ట శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి అన్నివిధాలుగా కృషి చేయాలని నాయకులు, కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. ఇంటింటి ప్రచారం చేపట్టాలని కోరారు. కాగా మాజీ స్పీకర్ మణిందర్‌సింగ్ ధర్, రాజు ధింగన్, ధర్మేంద్ర సింగ్ కోలి, హరీష్ ఖన్నా, రాజేష్‌గార్గ్‌తోపాటు మరొకరికి త్వరలో జరగనున్న ఎన్నికలకు సంబంధించి టికెట్లు ఇవ్వకూడదని ఆప్ నిర్ణయించిందని సమాచారం. వారు పనితీరును ఆధారంగా చేసుకునే ఈ నిర్ణయానికి వచ్చిందని తెలియవచ్చింది. అనంతరం ఎంపీ మనోజ్ తివారీ మాట్లాడుతూ తన పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని పది నియోజకవర్గాల్లో పార్టీ విజయకేతనం ఎగురవేసేలా అంతా సమష్టిగా కృషి చేయాలన్నారు.
 
 త్వరలో వెబ్‌సైట్
 విధానసభకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వెబ్‌సైట్‌ను  ప్రారంభించాలని బీజేపీ నిర్ణయించింది. కొన్ని కారణాల వల్ల ఈ సైట్‌ను గత నాలుగు నెలలుగా మూసివేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించాలని నిర్ణయించింది. రెండు లేదా మూడు రోజుల్లో ఇది ప్రారంభమయ్యే అవకాశముంది. ప్రత్యర్థి పార్టీ అయిన ఆప్... తన వెబ్‌సైట్‌ను ఎన్నికల ప్రచారం కోసం ఎంతో బాగా వినియోగిస్తున్న నేపథ్యంలో బీజేపీ కూడా అదే బాట పట్టింది.
 
 కాగా ఢిల్లీ శాసనసభ  సభ్యుల సంఖ్య 70. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మొత్తం 31 మంది శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే వీరిలో హర్షవర్ధన్, పర్వేష్ వర్మ, రమేశ్ బిధూరీలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 31 నుంచి 28కి పడిపోయింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల సంఖ్య 28 కాగా వారిలో రెబెల్ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీని బహిష్కరించడంతో వారి సంఖ్య 27కు పడిపోయింది. ఇక కాంగ్రెస్‌కు ఎనిమిది, ఎల్‌జేపీ, అకాలీదళ్ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులు ఉన్నారు. ఆప్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కొన్నాళ్లక్రితం సన్నద్ధత వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేందుకు నిరాకరించడంతో అది సాధ్యం కాలేదు.  ఇదిలాఉంచితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. 49 రోజులపాటు అధికారంలో ఉన్న కేజ్రీవాల్... జన్‌లోక్‌పాల్ బిల్లును సభ లోకి ప్రవేశపెట్టలేదనే సాకుతో ఆయన తన పదవినుంచి దిగిపోయారు. ఆ తర్వాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సారథ్యంలో అధికారిక కార్యక్రమాలు జరుగుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement