370 అధికరణ రద్దుతో అశాంతి
లండన్: జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికున్న ప్రత్యేక హోదాను రద్దు చేసేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు తనకు తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయని ఆ రాష్ట్ర మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా పేర్కొన్నారు. కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న అధికరణ 370ని రద్దు చేసిన పక్షంలో అది రాష్ట్రంలో తీవ్రమైన అశాంతికి దారితీస్తుందని హెచ్చరించారు. అదే జరిగితే రాష్ట్రంలో తిరిగి శాంతిని సాధించడం అసాధ్యమన్నారు. 77 ఏళ్ల ఫరూఖ్ తీవ్ర అనారోగ్యం కారణంగా మూడు నెలలుగా లండన్‌లో చికిత్స పొందుతున్నారు.
దీంతో రాష్ట్ర అసెంబ్లీకి తాజాగా జరుగుతున్న ఎన్నికలకు ఆయన దూరం కావాల్సివచ్చింది. వచ్చే ఫిబ్రవరి నాటికిగానీ ఆయన రాష్ట్రానికి చేరే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఆదివారం పీటీఐ వార్తాసంస్థతో మాట్లాడిన అబ్దుల్లా తన అభిప్రాయాలను వెల్లడించారు. రాజ్యాంగంలోని 370వ అధికరణను రద్దు చేయాలన్న బీజేపీ ఎజెండా తనకు తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు.
వార(బీజేపీ)నుకునేది సాధించడానికి ఏమైనా చేస్తారని, ఇందుకోసం ఎవరితోనైనా జట్టు కడతారని వ్యాఖ్యానించారు. వేర్పాటువాద నేత సజ్జాద్ లోనెను బుజ్జగించేందుకు బీజేపీ యత్నించడాన్ని ఆయన ఉదహరించారు. 370వ అధికరణ విషయంలో ఆర్‌ఎస్‌ఎస్ ఆదేశాలను ధిక్కరించే సాహసం ప్రధాని మోదీ చేస్తారో లేదో తనకు తెలియదని ఓ ప్రశ్నకు జవాబుగా అబ్దుల్లా చెప్పారు. ప్రస్తుత ఎన్నికలు ఎంతో కీలకమైనవని, రాష్ట్ర భవితవ్యాన్ని నిర్దేశిస్తాయని అభిప్రాయపడ్డారు. భారత రాజ్యాంగం పరిధిలో స్వయంప్రతిపత్తి కొనసాగుతుందా? లేదా అధికరణ 370 రద్దవుతుందా? అన్నది ఈ ఎన్నికలపై ఆధారపడి ఉందన్నారు. కాశ్మీర్‌కున్న ప్రత్యేక ప్రతిపత్తిని ధ్వంసం చేసే శక్తులకు వ్యతిరేకంగా ప్రజలంతా ఏకం కావాలని, ఈ క్రమంలో అన్ని విభేదాలను మరచిపోవాలని ఫరూఖ్ పిలుపునిచ్చారు. తన కుమారుడు ఒమర్ సారథ్యంలోని ఎన్‌సీకి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్‌సీకి ఎదురుదెబ్బ
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పాలకపక్షం నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్‌సీ)కు గట్టి ఎదురు దెబ్బ తగిలింగి. ఎన్సీ ప్రముఖ నేత, లోక్‌సభ మాజీ ఎంపీ మహబూబ్ బేగ్ ఆదివారం ఆ పార్టీని వీడారు. ఎన్నికల్లో అనంత్‌నాగ్ స్థానం నుంచి పోటీ చేయాలన్న పార్టీ ఆదేశాన్నీ తోసిపుచ్చారు. అంతేకాకుండా, అనంత్‌నాగ్ నుంచి పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) తరఫున పోటీ చేస్తున్న ముఫ్తీ మహమ్మద్ సయీద్‌కు బేషరతు మద్దతు ప్రకటించారు. ఎన్‌సీ తనను విశ్వాసంలోకి తీసుకోలేదని అందుకే పార్టీని వీడానని వివరించారు.