ఒబామాకు ఘన స్వాగతం | Advani, Bachchan, Dilip Kumar get Padma Vibhushan | Sakshi
Sakshi News home page

ఒబామాకు ఘన స్వాగతం

Published Mon, Jan 26 2015 3:03 AM | Last Updated on Fri, Aug 24 2018 8:06 PM

ఒబామాకు ఘన స్వాగతం - Sakshi

ఒబామాకు ఘన స్వాగతం

 న్యూఢిల్లీ: భారత సందర్శనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు అపూర్వంగా కనీవినీ ఎరుగని రీతిలో ఘన స్వాగతం లభించింది. ప్రొటోకాల్ నిబంధనలన్నింటినీ పక్కన పెట్టి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి ఒబామా దంపతులకు స్వాగతం పలకగా... రాష్ట్రపతి భవన్‌లో దేశంలోనే అత్యుత్తమమైన ‘21 గన్ శాల్యూట్’ గౌరవంతో.. రెడ్‌కార్పెట్ స్వాగతం లభించింది. ‘సైనిక వందనం (గార్డ్ ఆఫ్ హానర్)’తోనూ గౌరవించారు.

ఇంతకు ముందు 2010లో ఒబామా భారత పర్యటనకు వచ్చినప్పుడు అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ దంపతులు కూడా విమానాశ్రయానికి వెళ్లి స్వాగతం పలికారు. అయితే ఈ సారి దేశ గణతంత్ర వేడుకలకు ఒబామా ముఖ్య అతిథిగా హాజరవుతుండడంతో మరింత ప్రాధాన్యత దక్కుతోంది. తొలుత విమానాశ్రయంలో ఒబామాకు ప్రధాని మోదీ స్వయంగా ఎదురేగి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఒబామా, మోదీ ఒకరినొకరు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.
 
  అనంతరం ఒబామా దంపతులను మోదీ స్వయంగా తోడ్కొని విమానాశ్రయంలోకి వెళ్లారు. అక్కడి నుంచి తాము బస చేసే హోటల్‌కు వెళ్లిన ఒబామా దంపతులు అనంతరం రాష్ట్రపతి భవన్‌కు వచ్చారు. ఒబామా రాక సందర్భంగా రాష్ట్రపతి భవన్ ఆవరణను అత్యంత సుందరంగా అలంకరించారు. అక్కడి వేదికను కూడా అలంకరించి సిద్ధం చేశారు. రాష్ట్రపతి భవన్ గేటు వద్ద నుంచే ఒబామాకు ఘన స్వాగతం లభించింది. ఎరుపురంగు డ్రెస్, నీలిరంగు తలపాగాలు చుట్టుకున్న రాష్ట్రపతి బాడీగార్డుల అశ్విక దళం ఒబామా వాహనం ‘ది బీస్ట్’కు ముందు వెనుక నిలిచి లోపలికి తోడ్కొని వెళ్లింది. భవనం ప్రాంగణంలోకి వారు చేరుకోగానే... అప్పటికే అక్కడకి వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ ఒబామా దంపతులకు చిరునవ్వుతో స్వాగతం పలికారు.
 
  పలకరింపులు, కుశల ప్రశ్నల అనంతరం.. ఒబామాను రాష్ట్రపతి గార్డులు వేదికపైకి తోడ్కొని వెళ్లారు. భారత, అమెరికా జాతీయ గీతాల నేపథ్య సంగీతం వినిపిస్తుండగా.. మిలటరీ బ్యాండ్ వాయించారు. అనంతరం వింగ్ కమాండర్ పూజా ఠాకూర్ ఆధ్వర్యంలో నిర్వహించిన త్రివిధ దళాల సైనిక వందనాన్ని ఒబామా స్వీకరించారు. తర్వాత ఒబామాకు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పరిచయం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్, మనోహర్ పారికర్, వెంకయ్యనాయుడు, పీయూష్‌గోయల్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఒబామా దంపతులు మహాత్మాగాంధీకి నివాళులు అర్పించేందుకు రాజ్‌ఘాట్‌కు బయలుదేరి వెళ్లారు.
 
  చాలా సంతోషం..!
 తమకు లభించిన ఘన స్వాగతం, ఆతిథ్యం ఎంతో అపూర్వమని అమెరికా అధ్యక్షుడు ఒబామా సంతోషం వ్యక్తం చేశారు. సైనిక వందనం స్వీకరించిన అనంతరం రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు ఉన్న చోటికి వచ్చిన ఆయన భారతీయ సాంప్రదాయంలో రెండు చేతులనూ జోడించి ‘నమస్తే’ చెప్పారు. భారత్‌కు మరోసారి వచ్చిన తమకు ఇంత గౌరవం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు.
 
  మిషెల్ డ్రెస్ జిగేల్!
 న్యూఢిల్లీ: నలుపు రంగు డ్రెస్‌పై తెల్ల గీతలు.. వాటిపై నీలి రంగు పూల డిజైన్‌తో ఒబామా సతీమణి మిషెల్ మెరిసిపోయారు! మోకాల్ల వరకున్న ఈ డ్రెస్‌పై మ్యాచింగ్ కోటు ధరించారు. ఈ దుస్తులను న్యూయార్క్‌లోని భారతీయ డిజైనర్ బిహు మహాపాత్ర రూపొందించారు. ఒడిషాలోని రూర్కెలాకు చెందిన బిహు అమెరికాలో ప్రఖ్యాత డిజైనర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అన్నట్టూ.. మోదీ నియోజకవర్గమైన బెనారస్‌లో ఓ ప్రత్యేకమైన పట్టుచీర మిషెల్ కోసం రూపొందించారు. పూర్తిగా చేతితో నేసిన ఈ చీరలో సన్నని బంగారు, వెండి పోగులు వాడారు. 400 గ్రాములు ఉండే ఈ చీర ఖరీదు రూ.1.5 లక్షలు. బెనారస్‌కు చెందిన ముగ్గురు నిపుణులు దీన్ని మూడు నెలలు కష్టపడి తయారు చేశారు. శనివారమే దీన్ని దేశ రాజధానికి తీసుకెళ్లారు. మిషెల్ ఒబామాకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సతీమణి కశ్మీరీ శాలువ బహూకరించారు. భర్త ఒబామాతో కలిసి ఆదివారం రాష్ట్రపతి భవన్‌కు వచ్చిన ఆమెకు ప్రత్యేక ఎంబ్రాయిడరీ వర్క్‌తో రూపొందించిన ఈ శాలువాను అందజేశారు. ఈ సందర్భంగా ప్రణబ్ కూడా.. రాజస్థాన్ కళాకారుడు సుకుమార్ బోస్ రూపొందించిన ‘టీ సెట్’ను మిషెల్‌కు బహూకరించారు.
 
  ఒబామా రావడం శుభపరిణామం: తొగాడియా
 జైపూర్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్‌కు రావడం శుభ పరిణామమని విశ్వహిందూ పరిషత్ సీనియర్ నేత ప్రవీణ్ తొగాడియా అన్నారు. ఒబామా పర్యటనను అడ్డుకుండామన్న వార్తలను ఆదివారం ఆయన తోసి పుచ్చారు. ‘భారత్ ఎల్లప్పుడూ వ్యాపారవేత్తలకు స్వాగతం పలుకుతుంది. భవిష్యత్తులో ఇండియా కూడా అమెరికా సరసన నిలుస్తుంది.’ అని అన్నారు.
 
  మోదీ.. అదరహో!
 ఒబామాకు ఉదయం విమానాశ్రయంలో స్వాగతం పలికేందుకు ప్రధాని మోదీ గోధుమ రంగు కుర్తా పైజామా ధరించి, దానిపై నెహ్రూ జాకెట్ వేసుకుని వచ్చారు. భుజంపై ఎరుపు రంగు శాలువా ధరించారు. రాష్ట్రపతిభవన్‌లో కార్యక్రమానికి వచ్చినప్పుడు నలుపు రంగు బంద్‌గల్లా సూట్ ధరించి వచ్చారు. ఇదే సమయంలో రాష్ట్రపతి ప్రణబ్ కూడా నలుపు రంగు బంద్‌గల్లా సూట్ ధరించారు.
 
  పూజాఠాకూర్.. తొలి ‘లీడర్’

 త్రివిధ దళాల సైనిక వందనం కార్యక్రమానికి దేశంలోనే తొలిసారిగా ఒక మహిళా అధికారి నేతృత్వం వహించింది.. అది కూడా అమెరికా అధ్యక్షుడికి గౌరవసూచకంగా నిర్వహించిన కార్యక్రమంతో.. ఆ అధికారి వైమానిక దళంలో వింగ్ కమాండర్ పూజాఠాకూర్. కాగా ఈ అవకాశం లభించడంపై ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా పూజాఠాకూర్ పేర్కొన్నారు. ‘‘పురుషులైనా, మహిళలైనా ఒకేలా శిక్షణ ఇస్తారు. ఇద్దరూ సమానమే. కానీ సైనిక వందనానికి నేతృత్వం వహించే అవకాశం రావడం, అది కూడా ఒబామా కార్యక్రమానికి కావడం గర్వంగా ఉంది..’’ అని ఆమె చెప్పారు. 2000వ సంవత్సరంలో భారత వైమానిక దళంలో అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో చేరిన పూజాఠాకూర్ ప్రస్తుతం వైమానిక దళ ప్రధాన కార్యాలయంలో డెరైక్టరేట్ ఆఫ్ పర్సనల్ ఆఫీసర్స్ విభాగంలో పనిచేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement