
'అమ్మ'దే జయం
మూడు దశాబ్దాల పాటు కొనసాగిన ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారిపోయే సంప్రదాయాన్ని బద్దలు కొడుతూ.. ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి ఆరోపణలను అధిగమిస్తూ..
తమిళనాడులో జయలలితకు వరుసగా రెండో విజయం
♦ గట్టి పోటీ ఇచ్చిన డీఎంకే.. సభలో పెరిగిన బలం.. విజయ్‌కాంత్, శరత్‌కుమార్‌ల ఘోర పరాజయం
♦ ఖాతా తెరవని కమలదళం.. నేడు శాసనసభాపక్షం భేటీ.. 23న జయ ప్రమాణం
సాక్షి ప్రతినిధి, చెన్నై: మూడు దశాబ్దాల పాటు కొనసాగిన ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారిపోయే సంప్రదాయాన్ని బద్దలు కొడుతూ.. ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి ఆరోపణలను అధిగమిస్తూ.. బలమైన ప్రతిపక్ష కూటమితో పాటు.. మూడో కూటమితోనూ ఒంటరిగా తలపడుతూ.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత వరుసగా రెండోసారి విజయఢంకా మోగించారు.
దాదాపు ముప్పై ఏళ్ల నాడు ఎం.జి.రామచంద్రన్‌ను వరుసగా రెండోసారి ఎన్నుకున్న తర్వాత ఇప్పటివరకూ ఎవరికీ అటువంటి అవకాశం ఇవ్వని తమిళనాడు ప్రజలు ‘అమ్మ’కు ఆ అరుదైన అవకాశమిచ్చి మళ్లీ అందలమెక్కించారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన 232 అసెంబ్లీ స్థానాలకు గాను 134 సీట్లు గెలుచుకున్న అన్నా డీఎంకే శాసనసభాపక్షం శుక్రవారం సాయంత్రం సమావేశమై జయలలితను తమ నాయకురాలిగా ఎన్నుకోనుంది. ఆమె ఈ నెల 23వ తేదీన ఆరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
జయ - కరుణల మధ్యే పోరు!
రాష్ట్రంలోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను.. 232 స్థానాలకు ఈ నెల 16న పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. అన్నా డీఎంకే ఒంటరిగా, డీఎంకే - కాంగ్రెస్ ఒక కూటమిగా, డీఎండీకే, పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్, టీఎంసీల కూటమి ఒకవైపు.. బీజేపీ దాని చిన్న మిత్రపక్షాల కూటమి మరొకవైపు ఇలా బహుముఖ పోటీగా కనిపించినప్పటికీ.. ఎన్నికల్లో రాష్ట్రంలో బద్ధశత్రువులైన ప్రధాన ద్రవిడ పార్టీలు అన్నా డీఎంకే - డీఎంకేల మధ్యే వాస్తవపోరు సాగినట్లు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
గత లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 40 పార్లమెంటు స్థానాల్లో 39 గెలుచుకుని తమిళనాట తనకు తిరుగులేదని చాటిన జయలలిత ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ తన హవాను కొనసాగించారు. 134 స్థానాలు గెలుచుకుని సాధారణ మెజారిటీ సాధించారు. అయితే.. డీఎంకే, కాంగ్రెస్‌ల కూటమి ఆమెకు గట్టి పోటీ ఇస్తూ 98 సీట్లు గెలుచుకుని బలమైన ప్రతిపక్షంగా ఆవిర్భవించింది.
డీఎంకే అధినేత కరుణానిధి తిరువారూరు నుంచి, ఆయన కుమారుడు ఎం.కె.స్టాలిన్ కొళత్తూరు నుంచి గెలుపొందారు. ప్రజాసంక్షేమ కూటమి, పీఎంకే, బీజేపీలకు ఒక్కస్థానం కూడా దక్కలేదు. డీఎండీకే, పీడబ్ల్యూఫ్, టీఎంసీల కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి విజయ్‌కాంత్ పోటీచేసిన ఉలుండూరుపేటలో మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పీఎంకే అధినేత అన్బుమణి రామదాస్ పెన్నాగరం స్థానంలో రెండో స్థానంలో నిలిచారు. సీనియర్ నటుడు శరత్‌కుమార్ సహా పలువురు సినీ ప్రముఖులు పరాజయం పాలయ్యారు.
విపక్షాల తిట్లే దీవెనలుగా...
ఆస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు తీర్పుతో జైలుకు వెళ్లడం.. చెన్నైని ముంచెత్తిన వరదలను ఎదుర్కొనటంలోనూ వరద బాధితులను ఆదుకోవడంలోనూ వైఫల్యాల విమర్శలు.. టాస్మాక్‌ల ద్వారా ప్రభుత్వమే మద్యం అమ్మకాలు సాగించటంపై ఎత్తిపొడుపులు.. జయ ప్రచార సభల్లో ఐదుగురు మృతి చెందడం.. అన్నా డీఎంకే శ్రేణుల నుంచే భారీ ఎత్తున నగదు స్వాధీనం కావడం వంటి ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ.. జనం ‘అమ్మ’కు జేజేలు పలికారు.
అన్నా డీఎంకే ఒక వైపు.. ఇతర పార్టీలన్నీ ఒకవైపులా సాగిన ఈ ఎన్నికల్లో విపక్ష నేతలంతా కట్టకట్టుకుని జయను దూషిం చడం ప్రజలు సహించలేకపోయారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. డీఎంకే చెప్తున్నట్లుగా మద్యనిషేధం అమలు చేయడం వెంటనే సాధ్యం కాదని జయలలిత నిజాయితీగా చెప్పడాన్ని ప్రజలు హర్షించారు. 2జీ స్పెక్ట్రం కుంభకోణంలో లక్షల కోట్ల అవినీతికి పాల్పడింది డీఎంకే, కాంగ్రెస్ కూటమి అని.. వారిని నమ్ముతారా అనే ప్రశ్నలతో జయ ఎదురుదాడి చేశారు. డీఎంకే వస్తే అమ్మ క్యాంటీన్లు తదితర అమ్మ పథకాలు మూతపడతాయన్న ఆందోళన కూడా జయలలితకు కలిసి వచ్చింది.
అన్నాడీఎంకేకు 40.8% ఓట్లు
గత అసెంబ్లీ ఎన్నికలకన్నా ఈ ఎన్నికల్లో అన్నా డీఎంకే గెలిచిన సీట్లు కొంచెం తగ్గినప్పటికీ ఆ పార్టీకి పోలైన ఓట్ల శాతం స్వల్పంగా పెరిగింది. జయ పార్టీకి గత ఎన్నికల్లో 39.08 శాతం ఓట్లు రాగా.. ఈ ఎన్నికల్లో 40.8 శాతం ఓట్లు పోలయ్యాయి. 2011లో డీఎండీకేతో కలిసి పోటీ చేసిన అన్నా డీఎంకే కేవలం 165 సీట్లలో పోటీ చేసి 150 సీట్లు గెలుచుకుంది. మరోవైపు ప్రతిపక్ష డీఎంకే ఓట్ల శాతం కూడా గతం కన్నా గణనీయంగా పెరిగింది.
గత ఎన్నికల్లో కేవలం 22.38 శాతం ఓట్లు పొంది 23 సీట్లకు పరిమితమైన కరుణ పార్టీ.. ఇప్పుడు 31.6 శాతం ఓట్లు సంపాదించి 89 సీట్లలో గెలిచింది. ఇక 2011 ఎన్నికల్లో 2.24 ఓట్లు పొందిన బీజేపీకి ఈసారి 2.8 శాతం ఓట్లు లభించాయి కానీ సీటు మాత్రం దక్కలేదు.
నాడు ఎంజీఆర్.. నేడు జయలలిత...
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన రికార్డు నిన్నటి వరకు ఎం.జి.రామచంద్రన్‌ది మాత్రమే. 1977, 1980, 1985 లలో జరిగిన ఎన్నికల్లో ఎంజీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత ప్రస్తుత ఎన్నికల్లో తన రాజకీయ గురువు బాటలో రెండోసారి సీఎం పీఠాన్ని అధిరోహించి జయలలిత రికార్డు నెలకొల్పారు.
రాష్ట్రంలో అత్యధికంగా ఐదుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కరుణానిధి రికార్డును జయ ఆరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం ద్వారా చేరిపేయనున్నారు. అలాగే సిట్టింగ్ స్థానం నుంచి పోటీ చేసినప్పుడల్లా జయ ప్రభుత్వాన్ని చేజార్చుకున్నారనే గతంలోని సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి నేడు అధికారంలోకి వచ్చారు.
13వసారి అసెంబ్లీకి కరుణ
చెన్నై: డీఎంకే అధ్యక్షుడు ఎం.కరుణానిధి తిరువూరు నియోజకవర్గం నుంచి గెలుపొందారు.
అన్నాడీఎంకే అభ్యర్థిని 68, 366 ఓట్ల తేడాతో ఓడించారు.91 ఏళ్ల కరుణానిధి తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికవడం ఇది 13వసారి. 1957లో ప్రారంభమైన ఆయన రాజకీయ జీవితంలో ఓటమన్నది ఎరుగకపోవడం విశేషం.
నోటాకు అంతంత మాత్రమే
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ‘నోటా’కు నామమాత్రంగానే ఓట్లు పడ్డాయి. పోలింగ్ శాతంవారీగా చూస్తే ‘పై అభ్యర్థుల్లో ఎవరూ కాదు’(నోటా)కు పుదుచ్చేరిలో అత్యధికంగా 1.7 శాతం మంది (13,240 మంది) ఓటేశారు. పశ్చిమబెంగాల్లో 1.5% మంది(8,31,836), తమిళనాడులో 1.3%(5,57,888), అస్సాంలో 1.1%(1,88,978), కేరళలో 0.5%(1,07,106) మంది నోటా
బటన్ నొక్కారు.
ఎవరికీ అందుబాటులో ఉండరనే అపప్రథ.. చెన్నై వరద బాధితులను ఆదుకోవడంలో విఫలమయ్యారంటూ విపక్షాల ప్రచారం.. డీఎంకే-కాంగ్రెస్‌లతో పాటు తృతీయ కూటమి నుంచి తీవ్ర పోటీ మధ్య ‘పురచ్చి తలైవి’ జయలలిత తన పట్టు నిలుపుకున్నారు. ఒంటిచేత్తో వరుసగా రెండోసారి అన్నాడీఎంకేను అధికారంలోకి తీసుకొచ్చి చరిత్ర తిరగరాశారు.
ఎంజీఆర్ అడుగుజాడల్లో...
జయలలిత 1948 ఫిబ్రవరి 24న మైసూరు రాష్ర్టంలో తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. 1956లో వెన్నిరాడై చిత్రంతో తమిళ సినీ రంగంలోకి ప్రవేశించారు. అనంతరం అన్నాడీఎంకేలో చేరి 1984లో రాజ్యసభకు ఎన్నికయ్యారు.
1989లో అసెంబ్లీకి ఎన్నిక
1987లో ఎంజీఆర్ మరణం తర్వాత అన్నాడీఎంకే చీలిక వర్గానికి సారథ్యం వహించారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె సారథ్యంలోని అన్నాడీఎంకే 27 స్థానాలు గెలుపొందడంతో తమిళనాట తొలి మహిళా ప్రతిపక్ష నాయకురాలిగా జయ చరిత్ర సృష్టించారు. 1989 మార్చి 25న అసెంబ్లీలో తనపై దాడిని తీవ్రంగా పరిగణించిన జయ.. సీఎం అయ్యే వరకు అసెంబ్లీలోకి అడుగుపెట్టనంటూ శపథం చేశారు. 1991 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎం పీఠం ఎక్కారు. 1996లో అధికారం కోల్పోయినా.. 2001 ఎన్నికల్లో విజయదుందుభి మోగించారు. 2006లో పార్టీ ఓటమిపాలవగా 2011 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేను తిరిగి విజయపథాన నిలిపారు.
వెంటాడిన వివాదాలు...
జయ పబ్లికేషన్, శశి ఎంటర్‌ప్రైజెస్‌లో పెట్టుబడులతో పాటు జయ, ఆమె సన్నిహితురాలు శశికళ 1992లో తమిళనాడు స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ (టాన్సీ) నుంచి చౌకగా స్థలాన్ని కొనుగోలు చేయడం దుమారం రేపింది. దీనిపై డీఎంకే కేసు పెట్టగా 2000వ సంవత్సరంలో దిగువ కోర్టు జయ, శశికళలకు రెండేళ్ల జైలుశిక్ష విధించింది.
దీంతో 2001 అసెంబ్లీ ఎన్నికల్లో జయపై అనర్హత వేటు పడింది. ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకే గెలిచాక జయ సీఎంగా ప్రమాణం చేశారు. అయితే సుప్రీంకోర్టు ఆమెను అనర్హురాలిగా ప్రకటించింది. 2001 డిసెంబర్‌లో జయ, శశికళలను మద్రాస్ హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించడంతో జయ సీఎం పగ్గాలు చేపట్టారు.
ఈ తీర్పు డీఎంకే కుటుంబ పాలనకు శాశ్వత ముగింపు: జయలలిత
తమిళనాడు ప్రజలు తనను ఘనంగా గెలిపించటం ఎంతో సంతోషాన్నిస్తోందని.. ఈ చరిత్రాత్మక విజయం అందించినందుకు తాను, తన పార్టీ ప్రజలకు రుణపడి ఉంటామని ముఖ్యమంత్రి జయలలిత పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత ఆమె ఉత్సాహంగా మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఫలితాలు డీఎంకే కుటుంబ పరిపాలనకు శాశ్వత ముగింపు పలికాయని వ్యాఖ్యానించారు. తాను నూతనోత్తేజంతో ప్రజలకు సేవ చేస్తానని, పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నిటినీ అమలు చేయటానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.