తమిళనాడు జాతీయ రహదారుల శాఖలో పనిచేస్తున్న గుణశేఖరన్ (50) తన కొడుకుతో కలిసి పదోతరగతి పరీక్ష రాసి.. పాసయ్యారు కూడా!!
చదువుకు వయసు అడ్డం కాదని ఆ పెద్దాయన నిరూపించారు. తమిళనాడు జాతీయ రహదారుల శాఖలో పనిచేస్తున్న గుణశేఖరన్ (50) తన కొడుకుతో కలిసి పదోతరగతి పరీక్ష రాసి.. పాసయ్యారు కూడా!! రోడ్లు వేసే పని చేస్తున్న గుణశేఖరన్, పోలవకలి పాళ్యంలోని ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదువుతన్న ఆయన కొడుకు తమీజ్ ఇద్దరూ కలిసి పదోతరగతి పరీక్షలు రాశారు. ఆ పరీక్షల ఫలితాలు శుక్రవారమే వెల్లడయ్యాయి. తండ్రికి 500కు గాను 234 మార్కులు రాగా, కొడుకు ఏకంగా 459 మార్కులు సాధించినట్లు అధికారులు తెలిపారు.
హైస్కూలు వరకు రాకుండానే చదువు వదిలేసిన గుణశేఖరన్ కొన్నేళ్ల క్రితం ప్రైవేటుగా ఎనిమిదో తరగతి పరీక్ష రాసి పాసయ్యారు. రెండేళ్ల తర్వాత తన కొడుకుతో కలిసి ఇంటర్మీడియట్ కూడా రాస్తానని, దాంతో తనకు పదోన్నతి అవకాశాలు కూడా వస్తాయని గుణశేఖరన్ ఆనందంగా చెబుతున్నారు.