
న్యూఢిల్లీ: 2022 నాటికి దేశంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కృషి చేస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడంలో భాగంగా 2014–19 మధ్యకాలంలో వ్యవసాయ రంగానికి రూ.2.12 లక్షల కోట్లను కేటాయించామని వెల్లడించారు. ఇది గత ప్రభుత్వం కేటాయించినదానికి రెట్టింపు మొత్తమన్నారు. దేశానికి ఆహార భద్రతను కల్పించిన ఘనత పూర్తిగా రైతులదేనని ప్రధాని ప్రశంసించారు. అయితే గతంలో ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం రైతన్నల పరిస్థితి దయనీయంగా తయారయిందని విమర్శించారు.
కేంద్రం తీసుకొచ్చిన కీలక పథకాలపై ఆయా లబ్ధిదారులతో మోదీ సమావేశమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం దాదాపు 600 జిల్లాల్లోని పలువురు రైతులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు. ‘2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని మేం నిర్ణయం తీసుకున్నాం. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని చెప్పగానే చాలామంది మమ్మల్ని వేళాకోళం చేశారు. అది సాధ్యమయ్యే పనికాదని పెదవి విరిచారు. వాళ్లు వినాశకరమైన వాతావరణాన్ని దేశంలో సృష్టించారు. కానీ రైతన్నలపై నాకున్న విశ్వాసమే ఈ విషయంలో ముందుకు వెళ్లేలా చేసింది’ అని మోదీ వ్యాఖ్యానించారు.
‘ఓ విస్తృతమైన, సమతౌల్య విధానం ఆధారంగా రైతుల ఆదాయం పెంచేందుకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, నీరు, విద్యుత్‌ను అందించడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తులకు తగిన మార్కెట్ కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు నాలుగు అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నాం. వాటిలో పెట్టుబడి వ్యయాన్ని తగ్గించడం, వ్యవసాయ ఉత్పత్తులకు న్యాయమైన ధర అందించడం, కోత తర్వాత పంట నష్టపోకుండా చర్యలు తీసుకోవడం, రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరుల్ని కల్పించడం ఉన్నాయి’ అని ప్రధాని చెప్పారు.
నాడు రూ.1.21 లక్షల కోట్లే...
యూపీఏ–2 హయాంలో ఐదేళ్లలో వ్యవసాయానికి రూ.1.21 లక్షల కోట్లు కేటాయిస్తే.. 2014–19 కాలంలో వ్యవసాయ రంగానికి రెట్టింపు మొత్తాన్ని అంటే రూ.2.12 లక్షల కోట్లను కేటాయించామని మోదీ వెల్లడించారు. రైతుల ఆదాయాన్ని పెంచడంలో భాగంగా చేపలు, తేనెటీగల పెంపకం, పశుపోషణ వంటి ప్రత్యామ్నాయ రంగాలపై దృష్టి సారించామని మోదీ అన్నారు. తొలుత ఏ పొలంలో ఏ ఎరువులు వాడాలో తెలుసుకునేందుకు వీలుగా 12.5 కోట్ల మంది రైతులకు సాయిల్ హెల్త్ కార్డుల్ని జారీచేశామని చెప్పారు.
ఆ తర్వాత నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేసేందుకు వీలుగా బ్యాంకుల ద్వారా రుణాలను మంజూరు చేశామని వెల్లడించారు. యూరియాకు వేపపూత వేయడం ద్వారా ఎరువులు బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా నిరోధించామన్నారు. దళారుల బెడద లేకుండా పంట ఉత్పత్తుల్ని బహిరంగ మార్కెట్‌లో లాభసాటి ధరలకు అమ్ముకునేందుకు వీలుగా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ‘ఈ–నామ్’ను ఆవిష్కరించామని మోదీ పేర్కొన్నారు. అలాగే దాదాపు 22,000 గ్రామీణ మార్కెట్లను హోల్‌సేల్ మార్కెట్లతో అనుసంధానం చేశామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment