న్యూఢిల్లీ: భారత్ కోసం ఫ్రాన్స్ కంపెనీ డస్సాల్ట్ ఏవియేషన్ తయారుచేసిన తొలి రాఫెల్ ఫైటర్ జెట్‌ను ఐఏఎఫ్ డిప్యూటీ చీఫ్, ఎయిర్ మార్షల్ రఘునాథ్ నంబియార్ నడిపారు. రాఫెల్ కొనుగోళ్లలో భారీ కుంభకోణం చోటుచేసుకుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఐదు రోజుల క్రితం ఫ్రాన్స్‌కు చేరుకున్న నంబియార్ గురువారం రాఫెల్ జెట్ సమర్థత, పనితీరును పరీక్షించడంలో భాగంగా యుద్ధ విమానాన్ని నడిపారు. ఈ పర్యటనలో భాగంగా రాఫెల్ ఫైటర్ జెట్ల తయారీ పనుల్లో పురోగతిని సమీక్షించారు. భారత అవసరాలకు తగ్గట్లుగా రాఫెల్ జెట్‌లో మార్పులు సూచించేందుకు ఐఏఎఫ్ బృందం డస్సాల్ట్ ఏవియేషన్ కంపెనీతో కలసి పనిచేస్తోంది. భారత్‌కు రాఫెల్ ఫైటర్ జెట్ల సరఫరా 2019 నుంచి మొదలుకానుంది. ఫ్రాన్స్ నుంచి 36 రాఫెల్ ఫైటర్ జెట్లను(ఆయుధాలతో కలిపి) రూ.58,000 కోట్లకు కొంటోంది.
Comments
Please login to add a commentAdd a comment