నచ్చిన మహిళా కో పైలెట్ కోసం పట్టు..
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా పైలట్ల తీరు మారడం లేదు. ఎన్నిసార్లు హెచ్చరికలు చేసినా, ఎంతమందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నా పైలట్లు మాత్రం విధి నిర్వహణలో తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఓ పైలట్ తన డిమాండ్ కోసం 110 మంది ప్రయాణీకులను సుమారు రెండు గంటలపాటు విమానంలో వేచి చూడాల్సిన పరిస్థితి కల్పించాడు. అసలు విషయానికి వస్తే... తనకు నచ్చిన మహిళా పైలట్‌ను కో-పైలట్‌గా ఇవ్వలేదన్న కారణంతో ఈ చర్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో ఉదయం ఏడు గంటలకు బయలుదేరాల్సిన విమానం తొమ్మిది గంటల తర్వాత బయలుదేరింది.
పైలట్ మంకుపట్టుతో ఎయిర్ ఇండియా విమానంలో 110 మంది ప్రయాణీకులు రెండున్నర గంటలపాటు బలవంతంగా కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. దీంతో మాలే నుంచి చెన్నై మీదగా తిరువనంతపురం వెళ్ళాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో ఈ సంఘటన జరిగింది. ప్రత్యేకంగా తాను కోరిన మహిళా కో పైలట్నే Al 263/264 విమానంలో తనతోపాటు విధులకు పంపించాలంటూ పైలట్ పట్టుబట్టడంతో అసలు గొడవ ప్రారంభమైంది. అయితే ఆమె అప్పటికే ఢిల్లీ ఫ్లైట్కు వెళ్ళాల్సిన రోస్టర్ లో ఉందని, అతడి డిమాండ్ తీర్చడం కుదరదని రోస్టర్ సెక్షన్ అధికారులు తేల్చి చెప్పారు.
గురువారం ఉదయం విధులకు హాజరైన అతడు రోస్టర్ సెక్షన్ లో అదేతీరులో వ్యవహరించాడు. తనకు బీపీ పెరిగిందని, అనారోగ్యం పేరుతో కాలయాపన చేశాడు. అయితే అతడి ప్రయత్నం ఫలించకపోవటంతో...తాను కోరిన కో పైలట్ను పంపించనిదే విధులకు వెళ్లేది లేదంటూ తెగేసి చెప్పాడు. ఈ ఘటనతో ఉదయం ఏడు గంటలకు బయలుదేరాల్సిన విమానం తొమ్మిది గంటల తర్వాత బయలుదేరింది. కాగా ఇంత హంగామా చేసిన ఈ పైలట్ వారం క్రితం ఎయిర్ ఇండియాకు రాజీనామా చేసి, ప్రస్తుతం నోటీసు కాలంలో పని చేయటం గమనార్హం. అయితే ఈ విషయంపై పూర్తి వివరణ ఇచ్చేందుకు వైమానిక ప్రతినిధులు ఎవ్వరూ అందుబాటులో లేరు.