* షెడ్యూలు జారీచేసిన కేంద్ర ఎన్నికల సంఘం
* ఈనెల 14న జారీకానున్న నోటిఫికేషన్
సాక్షి, న్యూఢిల్లీ: ఆళ్లగడ్డ శాసనసభ నియోజకవర్గానికి వచ్చే నెల 8న ఉప ఎన్నిక జరగనుంది. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూలు విడుదల చేసింది. ఈ నియోజకవర్గం నుంచి గత సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరపున నామినేషన్ దాఖలు చేసిన భూమా శోభానాగిరెడ్డి ఎన్నికలకు ముందు ఏప్రిల్ 24న జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. అయితే ఆ ఎన్నికలో ఆమెకు అత్యధిక ఓట్లు పోలవడంతో ఆమె విజయం సాధించినట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ప్రజాప్రాతినిథ్య చట్టం, 1951లోని సెక్షన్-151 ఏ ప్రకారం నవంబరు 15, 2014 నాటికి ఆళ్లగడ్డ స్థానాన్ని భర్తీ చేయాలి. అయితే ఈ ఎన్నికపై రెండు పిటిషన్లు హైకోర్టులో పెండింగ్‌లో ఉండడంతో ఎన్నికల సంఘం ఉప ఎన్నికల సందర్భం గా ఈ స్థానానికి నోటిఫికేషన్ జారీచేయలేదు. ఆళ్లగడ్డ ఉప ఎన్నికపై ఎన్నికల సంఘానికి తగు ఆదేశాలు జారీచేయాలని భూమానాగిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆళ్లగడ్డకు చట్టప్రకారం ఉప ఎన్నిక నిర్వహించాలని హైకోర్టు పే ర్కొంది. ఈ మేరకు ఉప ఎన్నికకు షెడ్యూలు జా రీచేస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.
ఈవీఎంల ద్వారా పోలింగ్ ప్రక్రియ
ఉప ఎన్నిక ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలతో నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం పేర్కొం ది. 2014 జనవరి ఒకటో తేదీనాటికి సవరించిన ఓటరు జాబితాల ఆధారంగా 2014 జనవరి 31న ప్రచురితమైన తుది జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తారు.
ఆళ్లగడ్డ ఎన్నికపై మొదలైన తుది విచారణ
ఆళ్లగడ్డ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శోభా నాగిరెడ్డి పేరును బ్యాలెట్ పేపర్‌లో యథాతథంగా ఉంచుతూ, ఆమెకు అత్యధిక ఓట్లు వస్తే ఆమె గెలిచినట్లు ప్రకటిస్తామంటూ కేంద్ర ఎన్నికల ఇచ్చిన సర్కులర్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో మంగళవారం తుది విచారణ ప్రారంభమైంది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎం.ఎస్.ప్రసాద్ వాదనలు వినిపిస్తూ... ప్రజా ప్రాతినిథ్య చట్టం ప్రకారం బతికున్న అభ్యర్థుల్లో ఎవరు ఎక్కువ ఓట్లు సాధిస్తారో వారే గెలిచినట్లవుతుందని కోర్టుకు నివేదించారు.
చనిపోయిన వ్యక్తి పేరును బాలెట్‌లో ఉంచడం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది అవినాష్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ... ఎన్నిక జరగడానికి ముందే శోభా నాగిరెడ్డి మరణించినా కూడా ఎన్నికల నిబంధనల మేరకు ఆమె పేరును బ్యాలెట్ పేపర్‌లో యథాతథంగా కొనసాగించామని తెలిపారు. నిబంధనల ప్రకారం పోటీలో ఉన్న అభ్యర్థులను అధికారికంగా ఒకసారి ప్రకటించిన తరువాత వారి పేర్లను తొలగించడం కుదరదని పేర్కొన్నారు. తదుపరి వాదనల నిమిత్తం ధర్మాసనం విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
ఆళ్లగడ్డకు నవంబర్ 8న ఉప ఎన్నిక
Published Wed, Oct 8 2014 2:16 AM | Last Updated on Thu, Apr 4 2019 3:02 PM
Advertisement