సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ముస్లింలు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, వారంతా దేశ పౌరులుగానే కొనసాగుతారని హోంమంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. బుధవారం పౌరసత్వ సవరణ బిల్లును ఆయన రాజ్యసభలో ప్రవేశపెడుతూ ఈ బిల్లు ముస్లింలకు వ్యతిరేకమనే దుష్ర్పచారం సాగుతోందని, ఇది సత్యదూరమని స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ బిల్లు దేశంలోని ముస్లింలకు వ్యతిరేకం కాదని తేల్చిచెప్పారు. భారత్‌లో ముస్లింలు ఎలాంటి అభద్రతా భావానికి లోను కావాల్సిన అవసరం లేదని, వారంతా ఇక ముందూ ఈ దేశంలో భద్రంగా జీవించవచ్చని అన్నారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మకుండా భరోసాతో జీవించాలని, భయపడాల్సిన అవసరం లేదని అమిత్ షా కోరారు.
పొరుగు దేశాల నుంచి వచ్చిన వారందరికీ పౌరసత్వం ఇవ్వాలని కొందరు చెబుతున్నారని..పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్‌లు ఇస్లాంకు అనుగుణంగా తమ రాజ్యాంగాలను రూపొందించుకున్న క్రమంలో ఆయా దేశాల్లో ఇతర మతస్తుల మాదిరి ముస్లింలు మతపరమైన వివక్షను ఎదుర్కోవడం లేదని ఈ దేశాల నుంచి వచ్చే ముస్లింలకు పౌరసత్వం ఎలా ఇస్తామని ప్రశ్నించారు. ప్రపంచ దేశాలకు చెందిన ముస్లింలను మన పౌరులుగా చేయగలమా..? ఇది ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. మరోవైపు బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్‌ల నుంచి భారత్‌కు తరలివచ్చిన ముస్లిమేతర శరణార్ధులకు పౌరసత్వం కల్పించేలా పౌరసత్వ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment