న్యూఢిల్లీ: నాగాలాండ్‌లో తీవ్రవాదుల కదలికలపై విశ్వసనీయ సమాచారం ఉన్నప్పటికీ వారిని గుర్తించడంలో భద్రతా దళాలు పొరపాటు పడడం వల్లే కాల్పులు జరిగాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సంఘటనపై సిట్ నెల రోజుల్లోగా విచారణ పూర్తి చేస్తుందన్నారు. భవిష్యత్తులో తీవ్రవాదుల ఏరివేత ఆపరేషన్లు చేపట్టినప్పుడు ఈ ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్ని భద్రతా దళాలకు సూచించారు. ఈ మేరకు షా సోమవారం లోక్‌సభలో ప్రకటన చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.
తృణమూల్ మినహా ప్రతిపక్షాల వాకౌట్
అమిత్ షా ప్రకటనపై కాంగ్రెస్, డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ, ఎన్సీపీ తదితర ప్రతిపక్షాలు అసంతృప్తి వ్యక్తంచేశాయి. మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం, కాల్పులకు బాధ్యులైన వారిపై చర్యల గురించి ఆయన మాటమాత్రమైనా ప్రస్తావించలేదని మండిపడ్డాయి. షా ప్రకటనను నిరసిస్తూ సభను నుంచి వాకౌట్ చేశాయి. టీఎంసీ వాకౌట్ చేయలేదు. ఎలాంటి ప్రశ్నలకు ఆస్కారం ఇవ్వకుండా హోంమంత్రి ఏకపక్షంగా ప్రకటన చేసి వెళ్లిపోయారని లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ దుయ్యబట్టారు. అంతకుముందు నాగాలాండ్ ఘటనను ప్రతిపక్షాలు సభలో లేవనెత్తి కేంద్ర ప్రభుత్వం దీనిపై ప్రకటన చేయాలని డిమాండ్‌చేశాయి.
(చదవండి: Maharashtra: ప్రేమించి, పారిపోయి పెళ్లి.. గర్భిణీ అక్క తల నరికిన తమ్ముడు.. తీసుకొని)
హైదరాబాద్ నైపర్‌కు ‘జాతీయ’ హోదా బిల్లుకు లోక్‌సభ ఆమోదం
హైదరాబాద్, అహ్మదాబాద్, గువాహటి, హాజీపూర్, కోల్‌కతా, రాయ్‌బరేలీలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూ్యటికల్ ఎడ్యుకేషన్, రీసెర్చ్(నైపర్)లకు ‘జాతీయ ప్రాధాన్యత కలిగిన సంస్థ’ హోదా కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలియజేసింది. ఈ మేరకు నైపర్(సవరణ) బిల్లు–2021ను ఆరోగ్య మంత్రిæ మాండవియా సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు చట్టంగా మారితే నైపర్‌లకు ఒకేరకమైన జాతీయ హోదా లభిస్తుందని తెలిపారు. నార్కోటిక్స్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్(ఎన్‌డీపీఎస్) చట్టంలో దొర్లిన తప్పిదాన్ని సరిచేయడానికి సవరణ బిల్లు–2021ను కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది.
రాజ్యసభలో అదే దృశ్యం
రాజ్యసభ నుంచి 12 మంది సభ్యుల సస్పెన్షన్‌పై ప్రతిపక్షాలు పట్టు వీడటం లేదు. సోమవారం కూడా ఆందోళనకు దిగాయి. దీంతో నాలుగు సార్లు సభ వాయిదాపడింది. రాజ్యసభలో నినాదాల మధ్యే నాగాలాండ్ ఘటనపై షా ప్రకటన చేశారు. అనంతరం సభను మరుసటి రోజుకు వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment