ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో సత్యాగ్రహం ప్రారంభించిన అన్నా హజారే
సాక్షి, న్యూఢిల్లీ : అవినీతి వ్యతిరేక ఉద్యమంతో దాదాపు ఏడేళ్ల కిందట అప్పటి మన్మోహన్ సింగ్ సర్కార్‌ను ఊపేసిన సామాజిక కార్యకర్త అన్నా హజారే శుక్రవారం నుంచి మరోసారి నిరవధిక నిరాహార దీక్షకు శ్రీకారం చుట్టారు. 2011లో సత్యాగ్రహం చేపట్టిన ఢిల్లీలోని రాంలీలా మైదానమే తాజా ఆందోళనకూ వేదికైంది. రైతులు సమస్యలతో సతమతమవుతుంటే వాటి పరిష్కారంలో పాలకులు విఫలమయ్యారని ఆరోపించారు. తుదిశ్వాస విడిచే వరకూ తాను ప్రజల పక్షాన పోరాడతానని అన్నా హజారే స్పష్టం చేశారు. కాగా, దీక్ష ప్రారంభం కానున్న నేపథ్యంలో నిరసనకారులు ఢిల్లీ రాకుండా కేంద్ర ప్రభుత్వం రైళ్లను రద్దు చేస్తోందని హజారే ఆరోపించారు. ఢిల్లీకి రైళ్లలో తరలివస్తున్న నిరసనకారులను నిలిపివేస్తూ..వారిని హింసకు దిగేలా ప్రభుత్వం ప్రేరేపిస్తోందన్నారు. తనకు ఎలాంటి పోలీసు భద్రతా అవసరం లేదని ఇప్పటికే పలుమార్లు లేఖలు రాశానన్నారు. తమ ఆందోళన పట్ల ప్రభుత్వ తీరు సరిగ్గా లేదని మండిపడ్డారు.
అవినీతి కేసుల విచారణకు జన్‌లోక్‌పాల్ నియామకంపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నా హజారే ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అన్నా తొలుత రాజ్‌ఘాట్‌ను సందర్శించి అనంతరం రాం లీలా మైదాన్‌లో దీక్షకు ఉపక్రమించారు. దేశం నలుమూల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు అన్నా దీక్షకు తరలివస్తారని ఆయన సహచరులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment