న్యూఢిల్లీ: అన్నా ఎస్‌ఎంస్ కార్డులు విక్రయించి నాలుగు కోట్ల మందిని మోసం చేశారని, ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఇతరులపై ఎఫ్‌ఐఆర్ నమోదుచేయాలన్న పిటిషన్‌ను స్థానిక కోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు ఢిల్లీవాసి రుమల్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆకాశ్ జైన్ మంగళవారం విచారించారు. ఎలాంటి నేరం చేసినట్టు వెల్లడి కాలేదని, వారిపై చర్యలు అవసరం లేదని పోలీసులు తెలపడంతో ఆయన పిటిషన్‌ను తోసిపుచ్చారు. ఏడాది పాటు హజారే నేతృత్వంలో జరిగే ప్రచారాలకు సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తామన్న హామీతో 2012 ఫిబ్రవరిలో ఎస్‌ఎంస్ కార్డులను ప్రారంభించారని సింగ్ పిటిషన్‌లో ఆరోపించారు. ఇది హజారేతో పాటు ఆయన మాజీ బృంద సభ్యులకు రూ.100 కోట్లు తెచ్చిపెట్టిందన్నారు. అయితే వారి నుంచి ఎలాంటి సమాచారం లేకుండానే ఆ సేవలను నిలిచిపోయాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే హజారేతో పాటు ఆయన బృంద సభ్యులు ఎలాంటి నేరం చేసినట్టు రుజువు కాలేదని కోర్టుకు పోలీసులు తెలిపారు.