మరో ‘స్టింగ్’ దుమారం
రావత్ డబ్బులు పంచారని వీడియోలో వెల్లడించిన ఉత్తరాఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే
♦ విశ్వాస పరీక్షకు ముందు వేడెక్కిన రాజకీయం
♦ మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు: హరీశ్ రావత్
డెహ్రాడూన్/న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో విశ్వాస పరీక్షకు ముందు మళ్లీ రాజకీయ దుమారం రేగుతోంది. మంగళవారం(ఈ నెల 10న) విశ్వాస పరీక్ష జరగనుండగా.. ఆదివారం పదవీచ్యుత సీఎం హరీశ్ రావత్ లక్ష్యంగా మరో వీడియో లీకేజీ సంచలనం సృష్టిస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్‌సింగ్ బిస్త్, రెబల్ కాంగ్రెస్ ఎమ్మ్యెలే హరక్ సింగ్ రావత్ మధ్య జరిగిన సంభాషణ ఇది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేజారకుండా మైనింగ్ ద్వారా తాను సంపాదించిన దాన్ని ఎమ్మెల్యేలకు చెరో రూ.25 లక్షలు ఇచ్చారని మదన్‌సింగ్ బిస్త్ చెప్పినట్లు ఈ వీడియోలో ఉంది. దీన్ని బీజేపీ నేత భగత్‌సింగ్ కోషారియా ఢిల్లీలో విడుదల చేశారు. హరీశ్ రావత్ అవినీతితో సంపాదించిన డబ్బును ఎమ్మెల్యేలకు పంచారని ఆరోపించారు. అయితే.. విశ్వాస పరీక్షకు ముందు తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, వారిని భయపెడుతోందంటూ కాంగ్రెస్ విమర్శలు చేసిన నేపథ్యంలో ఈ వీడియో బయటకు రావటం సంచలనం సృష్టిస్తోంది. దీనిపై బీజేపీ-కాంగ్రెస్ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి.
బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు: రావత్
తనతోపాటు తన కుటుంబ సభ్యులు, బంధువుల ఫోన్లనూ కేంద్ర ఏజెన్సీలు ట్యాప్ చేశాయని.. వివిధ మార్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఇబ్బందులు పెడుతున్నాయని, వారిని బెదిరిస్తున్నారని రావత్ మండిపడ్డారు. ‘నేనేదో దేశవ్యతిరేక వ్యక్తి అయినట్లు నాపైనా నిఘా పెట్టారు. విశ్వాసపరీక్ష తర్వాత రాష్ట్రంలో బ్లాక్‌మెయిలర్లపై ప్రత్యేకంగా పోరాటం చేస్తా’మని డెహ్రాడూన్‌లో తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లోనూ విశ్వాస పరీక్షలో నెగ్గుతామన్న రావత్.. తాజా వీడియో గురించి తనకేమీ తెలియదన్నారు. కాగా, కావాలనే ఈ పరీక్షపై అనిశ్చితి నెలకొనేలా మధ్యప్రదేశ్ బీజేపీ నేత కైలాస్ విజయ్ వర్గీయను రంగంలోకి దించారని, ఆయన ఇలాంటి జిమ్మిక్కులు చేయటంలో నిష్ణాతుడని ఉత్తరాఖండ్ పీసీసీ చీఫ్ కిషోర్ ఆరోపించారు. మంగళవారం వరకు ఆయన్ను రాష్ట్రం నుంచి బయటకు పంపాలని పలువురు కాంగ్రెస్ నాయకులు ఆ రాష్ట్ర గవర్నర్ కేకే పాల్‌కు లేఖ రాశారు.
సర్కారు ఏర్పాటుచేస్తాం: బీజేపీ
రాష్ట్రంలో మే 10 తర్వాత తమ ప్రభుత్వమే ఏర్పడుతుందని బీజేపీ పేర్కొంది.విశ్వాసపరీక్షలో ఓడిపోతామనే భయంతోనే రావత్ డబ్బులిస్తున్నట్లు వీడియోలో ఈ విషయం బట్టబయలైందని తెలిపింది. ‘మే 10న ఎక్కువమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటేయనున్నారని మాజీ సీఎఎ కోషారియా తెలిపారు. తన పార్టీ ఎమ్మెల్యేలపైనే రావత్‌కు నమ్మకం లేదని అందుకే.. పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు చివరి ప్రయత్నంగానే డబ్బులు పంచారు’ అని అన్నారు.