రాష్ట్రపతి వద్దకు ఉత్తరాఖండ్ పంచాయితీ
ప్రణబ్‌ను కలసిన బీజేపీ, కాంగ్రెస్ ప్రతినిధులు
♦ కాంగ్రెస్ నుంచి మాజీ సీఎం కుమారుడి బహిష్కరణ
డెహ్రాడూన్/న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ పంచాయితీ రాష్ట్రపతి భవన్‌కు చేరింది. కాంగ్రెస్, బీజేపీ ప్రతినిధుల బృందాలు సోమవారం ప్రణబ్ ముఖర్జీని కలసి తమ వాదన లను వినిపించాయి. బీజేపీ, కేంద్ర ప్రభుత్వాలు కలసి రావత్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర చేస్తున్నాయని ఏకే ఆంటోనీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధుల బృందం ఫిర్యాదు చేసింది. గులాం నబీ ఆజాద్, మోతీలాల్ వోరా, అంబికా సోనీ, అహ్మద్ పటేల్, కపిల్ సిబల్‌లు కూడా రాష్ట్రపతిని కలసిన బృందంలో ఉన్నారు.
అంతకుముందు కైలాస్ విజయ్‌వర్గీయ నేతృత్వంలోని బీజేపీ బృందం రావత్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలంటూ ప్రణబ్‌ను కలసి విజ్ఞప్తి చేసింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వ రద్దుతో పాటు మెజార్టీ నిరూపణకు తమకు సమయమిచ్చేలా గవర్నర్‌ను ఆదేశించాలంటూ రాష్ట్రపతిని కోరామని విలేకరులకు కైలాస్ తెలిపారు. అసెంబ్లీలో తమకు 36 మంది ఎమ్మెల్యేల బలం ఉందని, సీఎంగా కొనసాగేందుకు రావత్‌కు ఎలాంటి నైతిక అర్హత లేదన్నారు. 9 మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు తమ బృందంతో కలసి రాష్ట్రపతి వద్దకు వెళ్లలేదని, వారు ఆయనను విడిగా కలుస్తారని బీజేపీ నేతలు పేర్కొన్నారు.
విజయ్ బహుగుణ కుమారుడిపై వేటు
మాజీ సీఎం విజయ్ బహుగుణ కుమారుడు సాకేత్‌తోపాటు జాయింట్ సెక్రటరీ అనిల్ గుప్తాలపై కాంగ్రెస్ పార్టీ సోమవారం వేటు వేసింది. వార్తాపత్రికల్లో వచ్చిన వ్యాఖ్యల్ని పరిగణనలోకి తీసుకుని వారిద్దరిని సస్పెండ్ చేయాలని క్రమశిక్షణ సంఘం పీసీసీకి సిఫార్సు చేసిందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కిషోర్ ఉపాధ్యాయ్ చెప్పారు. సిఫార్సుల్ని పరిగణనలోకి తీసుకుని సాకేత్, అనిల్‌ను ఆరేళ్లు బహిష్కరించామని తెలిపారు. ఎవరైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని సీఎం హరీష్ రావత్ సోమవారం ఆరోపించారు. డబ్బు, అధికార బలంతో చిన్న రాష్ట్రంలో అనిశ్చితికి ప్రయత్నిస్తోందని తప్పుపట్టారు. ప్రతి ఏడాది కొత్త ముఖ్యమంత్రి రావడం రాష్ట్రాభివృద్ధికి మంచిది కాదన్నారు. హరీష్ రావత్ సీఎంగా కొనసాగడం ముఖ్యంకాదని, ఉత్తరాఖండ్ అభివృద్ధికి సుస్థిర ప్రభుత్వం అవసరమని చెప్పారు. రాష్ట్రంలోని మంచి వాతావరణాన్ని చెడగొట్టడానికే మైనింగ్, భూ మాఫియాతో ప్రభుత్వం కుమ్మక్కయ్యిదంటూ బీజేపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని రావత్ విమర్శించారు.
స్పీకర్ తీరు అభ్యంతరకరం: బీజేపీ
ఆర్థిక బిల్లుపై ఓటింగ్ సందర్భంగా రావత్ ప్రభుత్వం విశ్వాసాన్ని కోల్పోయిందని, తక్షణం కాంగ్రెస్ సర్కారును రద్దుచేయాలని ఉత్తరాఖండ్ బీజేపీ డిమాండ్ చేసింది. బిల్లుపై ఓటింగ్ సమయంలో డివిజన్ కోరినా స్పీకర్ పట్టించుకోలేదని, సీఎంకు ప్రతినిధిలా ఆయన వ్యవహరిస్తున్నారని పార్టీ ప్రతినిధి మున్నాసింగ్ చౌహాన్ సోమవారం ఆరోపించారు. సభను నడిపించే నైతిక అర్హత స్పీకర్‌కు లేదని, తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉత్తరాఖండ్ సర్కారును కేంద్ర బీజేపీ నేతలు అస్తిరపరుస్తున్నారన్న ఆరోపణలు సరికాదని, పార్టీలో విభేదాల వల్లే కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిందన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రుల నిరంకుశ, అహంకార ధోరణివల్లే మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ పార్టీపై విశ్వాసం కోల్పోయారని చెప్పారు. 35 మంది ఎమ్మెల్యేలు స్పీకర్‌పై అవిశ్వాసానికి నోటీసు ఇచ్చాక... విప్ ధిక్కరించారంటూ కాంగ్రెస్ రెబెల్‌కు నోటీసులు జారీచేయడం చట్టవిరుద్ధమన్నారు.