
ముంబై : ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య తనను లైంగికంగా వేధించాడని మరో మహిళ జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ)కు ఫిర్యాదు చేశారు. గణేష్ ఆచార్య తనను లైంగికంగా వేధించాడని గతవారం మహిళా కొరియోగ్రాఫర్ ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన క్రమంలో మరో మహిళ ఇదే తరహా ఆరోపణలతో ముందుకు రావడం గమనార్హం. 1990లో ముంబైలోని అంథేరిలోని సహిబా హాల్‌కు తాను వెళుతుండగా అక్కడ పలువురు మాస్టర్లు డ్యాన్స్ క్లాసులు తీసుకునేవారని, కమల్ మాస్టార్జీ వద్ద ఆచార్య అసిస్టెంట్‌గా పనిచేసేవాడని బాధిత మహిళ చెప్పుకొచ్చారు. అప్పట్లో తనకు 18 సంవత్సరాల వయసుండేదని, నాన్ మెంబర్ డ్యాన్సర్‌గా పనిచేశానని చెప్పారు. ఓ రోజు ఆచార్య లైవ్ క్లాస్‌ల పేరుతో తనను హోటల్‌కు పిలిపించి లైంగిక దాడికి యత్నించాడని, తన ఇష్టానికి వ్యతిరేకంగా తన శరీరాన్ని అభ్యంతరకరంగా తాకాడని ఆరోపించారు.
పెళ్లి చేసుకుంటానంటూ మభ్యపెడుతూ అసభ్యకరంగా వ్యవహరించాడని, తాను పీరియడ్స్‌లో ఉన్నట్టు చెప్పగానే విడిచిపెట్టాడని వాపోయారు. గణేష్ ఆచార్య తనను లైంగికంగా వేధించాడని, తనకు వచ్చిన పనిపై కమిషన్లు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చేవాడని 33 ఏళ్ల మహిళా డ్యాన్సర్ గత వారం ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కాగా తనపై ఇద్దరు మహిళలు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలను గణేష్ ఆచార్య తోసిపుచ్చారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే వారు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. వారు పరిశ్రమలో కార్మిక సంఘాలను తమ చెప్పుచేతుల్లో ఉంచుకునేందుకు ప్రయత్నించాడాన్ని తాను వ్యతిరేకించినందుకే చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తనపై ఎన్ని కుట్రలు పన్నినా తాను భయపడనని మిడ్‌డేతో మాట్లాడుతూ ఆచార్య అన్నారు. ఇక గణేష్ ఆచార్యను బహిష్కరించాలని బాలీవుడ్ పరిశ్రమను నటి తనుశ్రీ దత్తా ఇటీవల కోరిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment