
ఏపీ ఎక్స్‌ప్రెస్ వేగం అంతే..!
న్యూఢిల్లీ : విశాఖ-న్యూఢిల్లీ మధ్య నడిచే ఏపీ ఎక్స్‌ప్రెస్ గరిష్టంగా 110 కి.మీ. వేగంతో మాత్రమే వెళ్తుందని కేంద్ర రైల్వే శాఖ స్పష్టం చేసింది. అందువల్ల ప్రస్తుత ప్రయాణ సమయాన్ని కుదించడం సాధ్యం కాదని పేర్కొంది. రాజ్యసభలో సభ్యుడు ఎం.ఎ.ఖాన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు శుక్రవారం సమాధానమిచ్చారు. ఈ ఎక్స్‌ప్రెస్ పేరును రాజధాని ఎక్స్‌ప్రెస్‌గా గానీ, దురంతో ఎక్స్‌ప్రెస్‌గా గానీ మార్చడం సాధ్యపడదన్నారు.
ఈ ఎక్స్‌ప్రెస్ రైలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలను దేశరాజధానితో అనుసంధానించేందుకు ఉద్దేశించినందున 19 హాల్టింగ్‌లతో నడుస్తోందని చెప్పారు. రాజధాని, దురంతో తరహాలో పనిచేసే అవకాశం కూడా ఈ ఎక్స్ప్రెస్కి లేదని తెలిపారు. అందువల్ల అటు వేగం పెంచడం గానీ, ఇటు హాల్టింగ్‌లు కుదించడం గానీ సాధ్యపడదని చెప్పారు. అయితే ఈ ఎక్స్ప్రెస్ రైలుకి నాన్ -ఏసీ బోగీలను కలపాలని వినతులు వెల్లువలా వచ్చాయని గుర్తు చేశారు. అయితే 2014-15 బడ్జెట్‌లో ఏపీ ఎక్స్‌ప్రెస్‌గా ప్రకటించిన నేపథ్యంలో దానిని మార్చలేమని వివరించారు.