తెలంగాణ కన్నా ఏపీకే ఎక్కువ!
కేంద్ర పన్నుల్లో తెలంగాణకు రూ.16,505 కోట్లు
ఏపీకి రూ.29,138 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈసారి బడ్జెట్లో కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే మొత్తాన్ని చూస్తే తెలంగాణకన్నా ఆంధ్రప్రదేశ్‌కు దాదాపు రెట్టింపు మొత్తం దక్కింది. సర్వీస్ ట్యాక్స్‌తో పాటు ప్రత్యక్ష, పరోక్ష పన్నుల ద్వారా సమకూరే మొత్తంలో నుంచి రాష్ట్రాలకు కేంద్రం కేటాయింపులు చేస్తుంది. ఈ రకంగా మొత్తమ్మీద 2017–18లో రాష్ట్రాలకు 6,74,565 కోట్లను కేటాయించనున్నట్లు కేంద్రం పేర్కొంది.
పన్నుల ద్వారా సమకూరే మొత్తంలో రాష్ట్రాలకు 42% కేటాయించాలన్న 14వ ఆర్థిక సంఘం సిఫారసుల్ని కేంద్రం ఆమోదించడం తెలిసిందే. తాజా బడ్జెట్ ప్రకారం రాష్ట్రాలకు మొత్తం కేంద్ర కేటాయింపుల్లో ఏపీకి 4.3% చొప్పున రూ.29,138 కోట్లు దక్కనున్నాయి. తెలంగాణకు మాత్రం 2.43 శాతనే, అంటే రూ.16,505 కోట్లు అందనుంది.
అన్ని రాష్ట్రాలకన్నా ఉత్తరప్రదేశ్‌కు అత్యధికంగా ఏకంగా 17.95% వాటా దక్కింది. ఆ రాష్ట్రానికి రూ.1,21,406 కోట్లు కేటాయించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా తెలియజేశారు. రూ.2,477 కోట్లతో సిక్కిం అన్నిటికన్నా తక్కువ వాటా పొందుతున్న రాష్ట్రంగా నిలిచింది. రూ.2,550 కోట్లతో గోవా తర్వాతి స్థానంలో నిలిచింది.