'తెలుగువాళ్లు మా స్నేహితులు' | aravind kejriwal in sakshi interview | Sakshi
Sakshi News home page

'తెలుగువాళ్లు మా స్నేహితులు'

Published Thu, Feb 5 2015 1:24 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

'తెలుగువాళ్లు మా స్నేహితులు' - Sakshi

'తెలుగువాళ్లు మా స్నేహితులు'

న్యూఢిల్లీ: ఢిల్లీలో తాము ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని, పూర్తి మెజార్టీతో తాము అధికారంలోకి రాబోతున్నట్టు ఆమ్ ఆద్మీపార్టీ అధినేత అరవింద్ కే జ్రీవాల్ విశ్వాసం వ్యక్తం చేశారు. బుధవారం మధ్యాహ్నం ఎలక్షన్ కమిషనర్‌ని కలిసిన అనంతరం 'సాక్షి' ఇంటర్వ్యూ లో పలు ప్రశ్నలకు ఆయన జవాబులిచ్చారు.

ప్రశ్న: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆమ్‌ఆద్మీపార్టీకి అనుకూలంగా రానున్నాయని అన్ని సర్వేలు చెబుతున్నాయి. ఎన్ని సీట్లు గెలుస్తామని మీరనుకుంటున్నారు?
జవాబు: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మేం ఈ సారి మెజార్టీ స్థానాలు గెలవబోతున్నాం. ఆ సంఖ్య ఎంత అన్నది ఫలితాల తర్వాత తేలుతుంది. అది సర్వేలు చెబుతున్నట్టు ఉండొచ్చు, అంతకంటే ఎక్కువగా, అంటే 45కి పైన రావొచ్చు.
ప్రశ్న: ఒకవేళ ఈసారి ఎన్నికల్లోనూ ఏ పార్టీకీ పూర్తి మెజార్టీ రాకపోతే మీరు మరోమారు కాంగ్రెస్ మద్దతు తీసుకుంటారా?
జవాబు: ఈసారి ఆ పరిస్థితి రాదు. ఆప్ పూర్తి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. బీజేపీ గెలుపు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. మోదీ సభలకు జనం రావట్లేదు. అ న్నీ చూస్తే మా గెలుపు ఖాయంగా కనిపిస్తోంది.

ప్రశ్న: బోగస్ కంపెనీల నుంచి ఆమ్‌ఆద్మీపార్టీ నిధులు సేకరించిందని అవామ్, బీజేపీలు ఆరోపిస్తున్నాయి కదా..?
జవాబు: ఈ విషయం మీద ఇప్పటికే చెప్పాం.  కేవలం ఆరోపణలతో లాభం లేదు.  సిట్‌తో విచారణ చేయించాలని మేమే డిమాండ్ చేస్తున్నాం. అయితే అన్ని పార్టీలకు అందుతున్న నిధులపైనా దర్యాప్తు చేయాలి. తప్పు తేలితే ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయాలి.
ప్రశ్న: ఢిల్లీలో చాలా ప్రాంతాల్లో దక్షిణాది రాష్ట్రాల ప్రజలు లక్షల సంఖ్యలో ఉన్నారు. వారి సంక్షేమానికి ఆమ్‌ఆద్మీపార్టీ ఏం భరోసా ఇస్తుంది?
జవాబు: మాకు అన్ని ప్రాంతాల వారు ఒక్కటే. జాతి, కులం, మతం, ప్రాంతం ఆధారంగా భేదాలుండవు. కానీ ఢిల్లీలో ఉన్న ఇతరులతో సమానంగా అన్ని హక్కులు కల్పించడంపై దృష్టిపెడతాం.

ప్రశ్న: ప్రత్యేకించి చాలా ప్రాంతాల్లోని తెలుగువారు ఏళ్లుగా అన్ని అంశాల్లో నిర్లక్ష్యానికి గురవుతున్నారు?
జవాబు: తెలుగు ప్రజలంతా మా స్నేహితులు. గత ఇరవైఏళ్లుగా వాళ్ల సమస్యలు మాకు తెలుసు. అన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తాం.
ప్రశ్న: ఎన్నికల కమిషనర్‌తో జరిగిన సమావేశంలో ఏ విషయంపై చర్చించారు?
జవాబు: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈవీఎం)లను ట్యాంపరింగ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్టు వస్తున్న అనుమానాలు నివృత్తి చేయాలని కోరాం. ఈ అంశాన్ని ఆలోచిస్తామని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. పోలింగ్ స్టేషన్ల ముందు పోస్టర్లు ఏర్పాటు చేయాలని కోరాం.

ప్రశ్న: గతంలో మీతో కలిసి పనిచేసిన కిరణ్‌బేడీ ఇప్పుడు మీ ప్రత్యర్థిగా బరిలో ఉన్నారు. దీనిపై మీ అభిప్రాయం?
జవాబు: కిరణ్‌బేడీ మంచి మహిళ. కానీ ఆమె పార్టీని ఎంచుకోవడంలోనే తప్పు చేశారని నా అభిప్రాయం.
ప్రశ్న: ఆమ్‌ఆద్మీపార్టీ అధికారంలోకి వచ్చి మీరు ఢిల్లీ సీఎం అయ్యాక ఏదైనా అంశంలో కేంద్ర ప్రభుత్వంతో విభేదాలొస్తే, గతంలో మాదిరిగా మళ్లీ రాజీనామాకు సిద్ధపడతారా?
జవాబు: రాజీనామా చేయడం మేం చేసిన పెద్ద తప్పు. ఈ సారి ఆ తప్పు జరగదు. ఐదేళ్లు ప్రభుత్వాన్ని నడుపుతాం. ఒకవేళ రాజీనామా చేయాల్సి వస్తే ఈసారి జనాన్ని అడిగి నిర్ణయం తీసుకుంటాం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement