న్యూ ఢిల్లీ : పోలవరం కాంట్రాక్టర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన చెల్లింపుల్లో అక్రమాలు జరిగినట్లుగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ)తోపాటు కాగ్ నివేదిక నిర్ధారించిన విషయం వాస్తవమేనని జల వనరుల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ అంగీకరించారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వకంగా జవాబిచ్చారు. కాంట్రాక్ట్ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్‌లో కొందరు కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన చెల్లింపులను వారి నుంచి తిరిగి రాబట్టాలని కూడా పీపీపీ సూచించిందని మంత్రి తెలిపారు. ఈ అక్రమ చెల్లింపులపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇస్తూ, త్వరితగతిన ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయించే హడావిడిలోనే భూ సేకరణ, స్టీల్ కొనుగోలుతోపాటు మరికొన్ని పనులలో ఆయా కాంట్రాక్టర్లకు నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు జరిపినట్లు తెలిపిందని చెప్పారు. అక్రమంగా చేసిన చెల్లింపు మొత్తాన్ని ఆయా కాంట్రాక్టర్ల బిల్లుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం రికవరీ చేసినట్లుగా తెలిపారు.
పోలవరం హెడ్ వర్క్స్ కాంట్రాక్ట్‌ను ఏదైనా కంపెనీకి లబ్ది చేకూర్చే విధంగా కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ వ్యవహరించిందా అన్న మరో ప్రశ్నకు.. మంత్రి మేఘ్‌వాల్ జవాబిస్తూ 2016 సెప్టెంబర్ 16న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన లేఖకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం తరపున పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చేపట్టినట్లు తెలిపారు. కాబట్టి ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఏ కాంట్రాక్టులైనా ఇచ్చే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు అందిన నివేదికల ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు 62.16 శాతం పూర్తయ్యాయని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ హెడ్ వర్క్స్ పనుల నాణ్యతను పనులు ప్రారంభమైనప్పటి నుంచి ధవళేశ్వరంలోని క్వాలిటీ కంట్రోల్ పర్యవేక్షిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అయితే పనుల నాణ్యతను మరింత పటిష్టంగా పర్యవేక్షించేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలోని సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్‌తో పీపీఏ ఒక అవగాహన కుదుర్చుకుందని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ కారణంగా ఒక లక్షా 5 వేల 601 కుటుంబాలు ఆశ్రయం కోల్పోయాయని, అందులో ఇప్పటి వరకు 3 వేల 922 నిర్వాసిత కుటుంబాలకు కొత్తగా నిర్మించిన 26 పునరావాస కాలనీల్లో ఆశ్రయం కల్పించామని మంత్రి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment