ముందున్నది మొసళ్ల పండగే: జైట్లీ
ముందున్నది మొసళ్ల పండగేనని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెబుతున్నారు. కేంద్ర బడ్జెట్లో వాతలు తప్పకపోవచ్చని ఆర్థికవేత్తలు ముందునుంచి వేస్తున్న అంచనాలను నిజం చేసేలాగే ఆయన మాటలు ఉంటున్నాయి. భారతదేశానికి ఆర్థిక క్రమశిక్షణ కావాలో.. లేదా ప్రజాకర్షక పథకాల మీద అర్థం పర్థం లేని వ్యయం కావాలో తేల్చుకోవాల్సిన అవసరం ఉందని జైట్లీ అన్నారు. మన వృద్ధిరేటు ఇప్పటికే మందగమనంలో ఉందని, ద్రవ్యలోటు కూడా చాలా ఎక్కువగా ఉందని, గత రెండేళ్లతో పోలిస్తే ద్రవ్యోల్బణం కాస్త తక్కువగానే ఉన్నా.. ఇప్పటికీ అది ఆమోదయోగ్యమైన స్థాయి కంటే ఎక్కువగానే ఉందని చెప్పారు. మనముందు అనేక సవాళ్లున్నాయని, రుతుపవనాలు ఆశాజనకంగా లేవని, ఇరాక్ ప్రభావంతో చమురు ధరలు మండుతున్నాయని కూడా తెలిపారు.
ఇలాంటి పరిస్థితుల్లో అర్థం పర్థం లేకుండా ప్రజాకర్షక పథకాల మీదే ఎక్కువగా దృష్టి పెడితే ఖజానా మీద భారం పెరిగిపోతుందని, అందువల్ల ఆర్థికమంత్రి ఎక్కువ పన్నులు విధిస్తారనే ఆశించాలని అరుణ్ జైట్లీ చెప్పారు. ఈ వ్యాఖ్యలను బట్టే రాబోయే కేంద్ర బడ్జెట్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది.