
నీటి ప్రాజెక్టులతో రాష్ట్రాల అభివృద్ధి
నీటి ప్రాజెక్టులపై అధిక పెట్టుబడుల ద్వారా రాష్ట్రాల అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు.
జల వారోత్సవాల్లో అరుణ్ జైట్లీ
సాక్షి, న్యూఢిల్లీ: నీటి ప్రాజెక్టులపై అధిక పెట్టుబడుల ద్వారా రాష్ట్రాల అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఈ రంగంలో పెట్టుబడులు త్వరగా ఫలితాలిస్తాయని వివిధ రాష్ట్రాల అనుభవాలు చెబుతున్నాయన్నారు. సోమవారమిక్కడ కేంద్ర జలవనరుల శాఖ ఏర్పాటు చేసిన జల వారోత్సవాల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నీటిపారుదల రంగంలో పెట్టుబడులు పెట్టి సౌకర్యాలను కల్పిస్తే తరువాయి సీజన్‌లోనే దాని ప్రభావం కనపడుతుందన్నారు. ప్రాజెక్టులపై పెట్టుబడులకు ఆసక్తి కనబర్చిన రాష్ట్రాలను ప్రస్తావిస్తూ మధ్యప్రదేశ్‌తోపాటు తెలుగు రాష్ట్రాలు కూడా ఈ దిశలో ముందంజలో ఉన్నాయని జైట్లీ చెప్పారు.
మధ్యప్రదేశ్ వ్యవసాయాభివృద్ది రేటు అత్యధికంగా 22 శాతానికి చేరిందని, నీటిపారుదల వసతుల కల్పన వల్లే ఇది సాధ్యమైందన్నారు. తెలంగాణ కూడా అదేవిధంగా చేసిందన్నారు. ఏపీలో ప్రభుత్వం ఇటీవల రెండు నదులను అనుసంధానించిందని, దాని ప్రభావం త్వరలో కనిపిస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తిగా అమలైన తర్వాత నీటిఎద్దడి అధికంగా ఉన్న అనంతపురం వంటి ప్రాంతాలకు నీరు అందుతుందన్నారు. భూగర్భ జలాలపెంపునకు కేంద్రం రూ.6వేల కోట్లు కేటాయించిందని జలవనరుల మంత్రి ఉమాభారతి చెప్పారు.
తెలంగాణ పథకాల వివరణ.. తెలుగు రాష్ట్రాల నీటిపారుదల ప్రాజెక్ట్‌లను కేంద్రం కొనియాడిందని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు చెప్పారు. కార్యక్రమంలో ఆయన తెలంగాణ ప్రాజెక్టులను వివరించారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్‌లను వేగవంతం చేయడం, త్వరగా పూర్తయ్యే మధ్య, చిన్న తరహా ప్రాజెక్ట్‌లను పూర్తిచేయాలని ఈ కార్యక్రమంలో నిర్ణయించారన్నారు.