
నీటి ప్రాజెక్టులపై జీఎస్టీ భారం వద్దు
దేశంలో సాగు, తాగునీటి ప్రాజెక్టు పనులు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) శ్లాబ్‌లపై పునరాలోచించాలని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కె. తారక రామారావు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి విజ్ఞప్తి చేశారు.
► జైట్లీతో సమావేశంలో మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి
► గ్రానైట్, బీడీ పరిశ్రమలపై పన్ను శ్లాబ్‌లు మార్చాలని వినతి
► సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ: దేశంలో సాగు, తాగునీటి ప్రాజెక్టు పనులు, చిన్న, మధ్య తరహా గ్రానైట్ పరిశ్రమలు, బీడీ పరిశ్రమపై విధించిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) శ్లాబ్‌లపై పునరాలోచించాలని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కె. తారక రామారావు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలో జైట్లీని ఆయన కార్యాలయంలో కలుసుకున్న కేటీఆర్.. రాష్ట్రానికి సంబంధించిన ఐదు ప్రధాన అంశాలపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న మిషన్ భగీరథ పనుల తోపాటు ఇతర సాగునీటి ప్రాజెక్టులు, పేదల గృహ నిర్మాణా లపై జీఎస్టీ వల్ల జాప్యం ఏర్పడుతుందన్నారు. ఈ పన్నుల వల్ల తెలం గాణ ప్రభుత్వంపై అదనంగా రూ. 11 వేల కోట్ల భారం పడుతుందని తెలిపారు. చిన్న, మధ్య తరహా గ్రానైట్ పరిశ్ర మలు, బీడీ పరిశ్ర మలపై విధించిన పన్ను శ్లాబ్‌లను మార్చాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన జైట్లీ... జీఎస్టీ వల్ల తీవ్ర ప్రభావానికి గురయ్యే రంగాల వివరాలు సమర్పించాలని కేటీఆర్‌కు సూచించారు.
ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని పెంచండి..
తెలంగాణ ప్రభుత్వ ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని 3.5 శాతానికి పెంచాలని జైట్లీని కేటీఆర్ కోరారు. తెలంగాణ రెండంకెల వృద్ధితో దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ముందున్నదని వివరిం చారు. అందువల్ల సంక్షేమ పథకాల అమలుకు ఎక్కువ రుణ సదుపాయాన్ని పొందేందుకు వీలుగా ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని పెంచాలని కోరారు. గత ఆర్థిక సంవత్సరానికి తెలంగాణకు వెనుకబడిన జిల్లాల కింద రావాల్సిన రూ. 450 కోట్ల మూడో విడత నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. హైదరా బాద్‌లో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫ్లై ఓవర్ల నిర్మాణానికి అవసరమైన రక్షణశాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని.. దానికి బదులుగా రాష్ట్ర భూములను కేటా యిస్తామన్నారు. దీనిపై రక్షణశాఖ కార్యదర్శి సంజయ్ మిత్రాను పిలిపించి మాట్లాడిన జైట్లీ.. హైదరాబాద్‌లో రక్షణ భూముల బదలాయింపునకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.