
న్యూ ఢిల్లీ: నొయిడా బొటానికల్ గార్డెన్ నుంచి ఢిల్లీలోని కల్కాజీ వరకు నిర్మించిన మెట్రోరైలు ప్రారంభోత్సవానికి హస్తిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఆహ్వానం అందకపోవడం రాజకీయంగా విమర్శలకు తావిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేతుల మీదుగా ఈ మెట్రోలైన్ ఈ నెల 25న ప్రారంభం కానుంది. యూపీ పరిధిలోకి వచ్చే నొయిడాలోని బొటానికల్ గార్డెన్ వద్ద ఈ ప్రారంభోత్సవ వేడక జరుగుతుంది. దేశ రాజధాని ప్రాంతంలో ఇది మొదటి ఇంటర్‌చేంజ్ స్టేషన్ కావడం గమనార్హం.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం వీఐపీ అతిథుల జాబితాలో అరవింద్ కేజ్రీవాల్ పేరు లేదు. 12.64 కిలోమీటర్ల పొడవున్న ఈ మెట్రోలైన్ ఢిల్లీలో ముగుస్తుంది. ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ (డీఎంఆర్సీ) హస్తిన, కేంద్ర ప్రభుత్వాల (కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ) జాయింట్ వెంచర్ (ఇరు వర్గాలకు 50:50 వాటా ఉంది). నొయిడా నుంచి మెట్రోలైన్‌కు యూపీ ప్రభుత్వమే నిధులు సమకూర్చినప్పటికీ, ఢిల్లీలో పొడిగించిన మేర దూరానికి ఆ రాష్ట్ర ప్రభుత్వమే నిధులు భరించింది. ఈ నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్‌కు ఆహ్వానం అందకపోవడం విమర్శలకు తావిస్తోంది.
ఆహ్వానం అందని విషయాన్ని ఢిల్లీ ప్రభుత్వ అధికార ప్రతినిధి సైతం ధ్రువీకరించారు. ఆయన మాట్లాడుతూ ఢిల్లీ మెట్రో రైలు కార్పోరేషన్(డీఎంఆర్‌సీ) నుంచి అధికారికంగా ఎలాంటి పిలుపు రాలేదని తెలిపారు. తక్కువ ధరలతో మెట్రో ప్రయాణం సురక్షితంగా సాగలన్నదే తమ లక్ష్యమని అన్నారు. మెట్రో నిర్మాణ సంస్థలు ధరల పెంపును ప్రతిపాదించినప్పుడు ప్రభుత్వం అంగీకరించలేదని వెల్లడించారు. కానీ ఢిల్లీ మెట్రో సంస్థ, కేంద్ర ప్రభుత్వంతో కలిసి ధరల పెంపు నిర్ణయాన్ని తీసుకుందని పేర్కొన్నారు. తమకు ఆహ్వానం అందకపోవడంపై ఎమైనా ప్రశ్నలు అడగదలుచుకుంటే పట్టణాభివృద్ధి శాఖను, డీఎంఆర్‌సీని సంప్రదించాలని తెలిపారు.
బొటానికల్ గార్డెన్ నుంచి కల్కాజీ వరకు పారంభం కానున్న మార్గంలో తొమ్మిది స్టేషన్‌లున్నాయి. దీని ద్వారా ఈ మార్గంలో ప్రయాణ సమయం 52 నిమిషాల నుంచి 19 నిమిషాలకు తగ్గనుంది. అధునాతన టెక్నాలజీతో డ్రైవర్ లేకుండా రైలు పరుగులు పెట్టనుంది. ఇది ఈ ఏడాదిలో ప్రధాని మోదీ ప్రాంభించనున్న మూడో మెట్రోరైలు కావడం విశేషం. జూన్‌లో కొచ్చి మెట్రోను, నవంబర్‌లో హైదరాబాద్ మెట్రోను మోదీ ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment