
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలో కొత్త మెట్రో రైల్ లైన్ ప్రారంభమైంది. ఢిల్లీ నుంచి నోయిడాను కలిపే మాజెంటాలైన్‌ను క్రిస్టమస్ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. నోయిడాకు తొలి మెట్రో రైల్ కూడా ఇదే. దాదాపు 12.6కిలోమీటర్ల పొడవునా నిర్మించిన ఈ మార్గం ఢిల్లీలోని కాల్కాజీ నుంచి నోయిడా వరకు ఉంది. ప్రధాని నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇతర ప్రభుత్వ అధికారులు తొలిసారి ఈ రైలులో నోయిడా నుంచి ఓక్లా బర్డ్ శాంక్చూరి స్టేషన్ వరకు ప్రయాణించారు. అయితే, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు తీవ్ర అవమానం జరిగింది. ఆయనను మరోసారి మెట్రో రైల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించలేదు.
ఢిల్లీలో మెట్రో కొత్త లైన్ ప్రారంభంకావడం ఆ కార్యక్రమానికి కేజ్రీవాల్‌ను ఆహ్వానించకపోవడం ఇది మూడోసారి. అయితే, ఈ మూడుసార్లు కూడా ప్రధాని మోదీ మాత్రం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మోదీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ పట్ల బీజేపీ ప్రభుత్వ వివక్షపూరితంగా వ్యవహరిస్తోందని, కిందిస్థాయి మనస్తత్వంతో వ్యవహరిస్తోందని మండిపడింది. కేజ్రీవాల్ అంటే బీజేపీకి ఏహ్యభావం ఉందని కూడా ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈ వ్యవహారంపై స్పందించేందుకు నిరాకరించారు. క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపిన ఆయన రాజకీయాలపై ప్రస్తుతం చర్చ అవసరం లేదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment