
అ 'సామాన్యుడు'
న్యూఢిల్లీ: రాజకీయల్లోకి రాకముందు కేజ్రీవాల్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్‌ఎస్)లో ఆఫీసర్‌గా పనిచేశారు. పేదల పక్షాన నిలబడి వారి సామాజిక న్యాయం కోసం ఎంతో కృషి చేశారు. సమాచార హక్కు చట్టాన్ని సామాన్య మానవుల ఆయుధంగా ఉపయోగపడేందుకు కృషి చేయడం ద్వారా 2006లో ప్రతిష్టాత్మకమైన రామన్ మెగసెసే అవార్డును అందుకున్నారు. హర్యానాలోని హిస్సార్‌లో 1968, ఆగస్టు 16న జన్మించిన కేజ్రివాల్ ఖరగ్‌పూర్ ఐఐటీలో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చదివారు. 1989లో టాటా స్టీల్ కంపెనీలో ఉద్యోగిగా చేరారు. మూడేళ్ల అనంతరం ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి 1992లో యూపీఎస్సీ పరీక్షలు రాసి రెవెన్యూ సర్వీస్‌లో చేరారు.
ఆ తర్వాత ఆ ఉద్యోగానికి కూడా రాజకీమా చేసి ‘పీపుల్ కాజ్ ఫౌండేషన్’ పేరిట ఓ ఎన్జీవో ను ఎర్పాటు చేశారు. నాటి నుంచి పూర్తిస్థాయి సామిజిక కార్యకర్తగా మారిపోయిన కేజ్రివాల్ మృదు స్వభావి. శాకాహారి. ఎక్కడవున్న వెంట తెచ్చుకున్న ఇంటి భోజనమే తింటారు. తనతోపాటు ఐఆర్‌ఎస్‌లో చేరిన సునితను ఆయన పెళ్లి చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు పిల్లలు. కూతురు హర్ష, కుమారుడు పునిత్.
అన్నా తో మరో పోరాటం
దేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతి జాఢ్యాన్ని నిర్మూలిస్తేగానీ దేశం బాగుపడదని భావించిన సామాజిక కార్యకర్త అన్నా హజారే పిలుపుకు స్పందించిన అరవింద్ కేజ్రీవాల్ అన్నాకు అండగా నిలబడ్డారు. అవినీతిపరుల భరతం పట్టేందుకు పటిష్టమైన లోక్‌పాల్ బిల్లు కోసం హజారోతో గొంతు కలిపారు. ఆయనతో కలిసి ధర్నాలు, దీక్షలు, వరుస ఆందోళనలు నిర్వహించారు. అప్పటి యూపీఏ ప్రభుత్వం పటిష్టమైన లోక్‌పాల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలనే హజారే డిమాండ్‌ను ఆమోదించినప్పటికీ దాన్ని అమలు చేసే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని అనతికాలంలోనే గ్రహించిన అన్నా అనుచరుడు అరవింద్ కేజ్రీవాల్ తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తేనేగానీ వ్యవస్థ ప్రక్షాళన కుదరదని భావించారు. ‘రాజకీయాలు ఓ బురద గుంట. అందులోకి దిగితే బయటకు రాలేం. సామాజిక కార్యకర్తలుగానే మన కర్తవ్యాన్ని నిర్వహిద్దాం’ అంటూ తన గురువు అన్నా హజారే చేసిన హెచ్చరికలను కూడా పట్టించుకోకుండా కేజ్రీవాల్ రాజకీయ కదన రంగంలోకి దిగారు. అవినీతి నిర్మూలనే ధ్యేయంగా చీపురు పట్టారు. గతేడాది ఫిబ్రవరి 14వ తేదీన తాను చేస్తున్న ప్రభుత్వోద్యోగానికి రాజీనామా చేశారు. ఢిల్లీ అపెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి 28 సీట్లను సాధించారు. ఊహించిన విధంగా సంపూర్ణ మెజారిటీ సాధించలేక పోయారు. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఎంతోకాలం ప్రభుత్వాన్ని నిలబెట్టుకోలేక పోయారు. 49 రోజుల్లోనే పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.