సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులో ఉందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. జూన్ నెలాఖరు నాటికి ఢిల్లీలో 60,000 యాక్టివ్ కేసులు ఉంటాయని అంచనా వేయగా ఇప్పుడవి 26,000గా నమోదయ్యాయని చెప్పారు. గత వారం ప్రతిరోజూ 4000 కేసులు వెలుగుచూడగా ఇప్పుడు తాజా కేసులు 2500కు పడిపోయాయని గుర్తుచేశారు. ఇక గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 2,1999 కోవిడ్-19 కేసులు నమోదవగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 87,360కి చేరింది. ఢిల్లీలో కరోనా మహమ్మారి బారినపడి ఇప్పటివరకూ 2742 మంది మరణించారు.
గత వారం రోజులుగా రోజువారీ నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోందని ఇది వైరస్ బలహీనపడుతోందనేందుకు సంకేతమని చెప్పారు. ఢిల్లీలో ముమ్మరంగా చేపడుతున్న టెస్టింగ్‌లో కూడా ఈ ధోరణి కనిపించిందని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. ఢిల్లీలో కరోనా రోగుల రికవరీ రేటు 60 నుంచి 66 శాతానికి పెరిగిందని వెల్లడించారు. మరణాల రేటు మూడు శాతంగా ఉందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment