న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో 'ధన్యవాద్ ఢిల్లీ' పేరుతో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ముగింపు సమయంలో కేజ్రీవాల్ పాడిన ఒక పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'నేను ఇప్సుడు ఒక పాట పాడతాను. కానీ ఒక కండీషన్.. అదేంటంటే.. నేను పాట పాడితే నాతోపాటు మీరు కూడా పాడాలి. మనందరి సమిష్టి కలను నెరవేర్చుకునేందుకు ఈ ప్రార్థన చాలా అవసరం' అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా 'హమ్ హోంగే కామ్ యాబ్'(వి షాల్ ఓవర్‌కమ్) పాటను పాడి.. అందరితో పాడించారు. ప్రస్తుతం ఈ పాట నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. (కాంగ్రెస్, బీజేపీ అని కాదు.. అంతా నా వాళ్లే..!)
1960లలో యూఎస్ లో పౌర హక్కుల ఉద్యమం సమయంలో (వి షాల్ ఓవర్‌కమ్) పాట ఎంతో ప్రాచుర్యం పొంది.. వారి ఉద్యమానికి బాసటగా నిలిచింది. ఇదే పాటను హిందీ కవి గిరిజా కుమార్ మాథుర్ 'హమ్ హోంగే కామ్ యాబ్' పేరుతో హిందీలోకి అనువాదం చేశారు.ఇంతకుముందు కూడా రెండు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకార ముగింపు సమయంలో కేజ్రీవాల్ ఇలాగే హిందీ చిత్రం 'పైగాం'లోని 'ఇన్సాన్ కా హో ఇన్సాన్ సే భైచారా' అనే దేశభక్తి గీతం ఆలపించడం విశేషం. ఇక కేజ్రీవాల్‌తో పాటు ఆరుగురు ఆప్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. వారిలో మనీష్ సిసోడియా, కైలేష్ గెహ్లాట్, ఇమ్రాన్ హుస్సేన్, సత్యేంద్ర జైన్, గోపాల్ రాయ్, రాజేంద్ర పాల్ గౌతమ్‌లు ఉన్నారు. ఢిల్లీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గానూ 62 గెలవగా, బీజేపీ 8 స్థానాలను గెలుచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment